ప్రజలపై ఆర్థికభారం తగ్గించడానికే చలానా డిస్కౌంట్లు ప్రకటించామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న దృశ్యా పెండింగ్ చలానా డిస్కౌంట్ ప్రకటించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలానాలతో 1,750 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, డిస్కౌంట్ ప్రకటించడం వల్ల కేవలం 300 కోట్లు మాత్రమే ఆదాయం రానుందన్నారు. ట్రాఫిక్ చలాన్ల వల్లే ప్రభుత్వంకు రెవెన్యూ వస్తుందనే అపోహ ఉండకూడదని, రెవెన్యూ నింపడానికి అయితే డిస్కౌంట్ లేకుండా మొత్తం కట్టాలనేవాళ్లమని ఆయన అన్నారు.
ప్రజలకు ఆర్థిక భారం పడకూడదనే సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారని, ట్రాఫిక్ చలాన వల్ల వచ్చే రెవెన్యూ చాలా స్వల్పమని ఆయన వెల్లడించారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చలానా వేయాల్సిన పరిస్థితే ఉండదని, మార్చి31 తర్వాత చలానా డిస్కౌంట్ ఉండవు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. 50కోట్ల విలువ గల చలాన్లు క్లియర్ అయ్యాయని, తొలి మూడు రోజుల్లో 39 కోట్ల వసూలు అయ్యాయని ఆయన తెలిపారు. మార్చి 31 నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. స్పీడ్ లిమిట్స్ పై కూడా ఒక నోటిఫికేషన్ తయారు చేస్తున్నామని, అధిక స్పీడ్ తో వెళ్లిన వారికి 1000 ఫైన్ ఉండేదని, వాహనాన్ని బట్టి స్పీడ్ చలాన్లు వేసేలా సర్క్యులర్ తయారు చేస్తున్నామన్నారు. టూ వీలర్స్‌కి 200 నుండి 300 వరకు ఫైన్ విధించేలా చేస్తామని, రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.