తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలంటూ గాంధీభవన్‌లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగం పోయేవరకు కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం లోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ని అధికారం లోకి తెచ్చే బాధ్యత నాది అని, మీరు 12 నెల్ల సమయం ఇవ్వండని ఆయన అన్నారు.
ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానని, గోల్కొండ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్త అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ పేరు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తానని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతాడని ఆయన అన్నారు. నన్ను రాజీనామా చేయమని ఓ సన్నాసి చెప్తున్నారని, కేసీఆర్‌కి దమ్ముంటే ఇప్పుడే ప్రభుత్వం నీ రద్దు చేయమని చెప్పు.. కొట్లడదాం అంటూ ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్‌కు చేత కాక పీకేని తెచ్చుకున్నాడని ఆయన విమర్శించారు.
