TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా

  • ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ధీమా
  • నేతలకు స్వేచ్ఛ ఉంది.. హద్దులు దాటొద్దు
  • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
  • రాజగోపాల్ రెడ్డి హాజరుపై మహేష్ గౌడ్ హర్షం
Mahesh Goud

Mahesh Goud

రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికలతో పాటు స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన గుర్తుచేశారు.

పార్టీ క్రమశిక్షణ, అంతర్గత పరిణామాలు

పార్టీ నేతల వైఖరి, అంతర్గత అంశాలపై మాట్లాడిన పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీలో నాయకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఆ స్వేచ్ఛ హద్దులు దాటకూడదని స్పష్టం చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే జి. చిన్నారెడ్డి, కొండా సురేఖ వంటి నాయకులతో మాట్లాడారని వెల్లడించారు. ఇక కొండా సురేఖకు మరో కొత్త పదవి ఇవ్వనున్నారనే ప్రచారంపై స్పందిస్తూ, ఆ విధమైన సమాచారం ఏదీ తన వద్ద లేదని ఆయన తేల్చిచెప్పారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్పించే నివేదిక ఆధారంగా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తామని వెల్లడించారు. ఈ స్థానాల కోసం పోటీ పడుతున్న ఆశావాహులలో అధిక శాతం మంది యువకులు ఉండటం విశేషమని పేర్కొన్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకావడం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.