Site icon NTV Telugu

TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్, పంచాయతీ ఫలితాలే సాక్ష్యం..

Mahesh Goud

Mahesh Goud

TPCC Mahesh Goud : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల ముందే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకు 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఉద్యోగ హామీల విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అడుగడుగున కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యం లేకుండా, సోనియా గాంధీకి లేఖ రాయడం నైతిక హక్కుకు విరుద్ధమని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసీ నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు తగిన న్యాయం చేయలేదని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయాలే ప్రభుత్వ పనితీరుకు స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర నేతలు స్పష్టమైన సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

Bangladesh: బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు..

Exit mobile version