Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి

కర్ణాటకలో దారుణం జరిగింది. అభయారణ్యంలో వన్యప్రాణుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. విషప్రయోగం ప్రయోగించడంతో ఐదు పులులు మృత్యువాత పడ్డాయి. కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్‌లోని హూగ్యం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పులి, దాని నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు తెలిపారు. ఒకేరోజు ఐదు పులులు చనిపోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. అయితే చనిపోయిన పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపిందని అటవీ అధికారులు తెలిపారు. అయితే సమీప గ్రామస్తులు పగతో కళేబరంలో విషం కలిపి పులికి ఎర వేసి ఉంటారని.. ఆ కళేబరం తిన్న పులులు చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. శవపరీక్షలో కూడా విష ప్రయోగం వల్లే చనిపోయినట్లుగా తేలిందని చెప్పారు.

వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి లతోపాటు మరికొందరు చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ గురువారం జరగాల్సిన నేపథ్యంలో దానిని కొన్ని కారణాల వల్ల శుక్రవారంకి వాయిదా వేసింది. సింగయ్య మృతికి సంబంధించిన ఘటనపై న్యాయమూర్తి డా. జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు కేసు విచారణకు రాగా, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలో ఆయన పూర్తి వివరాలను సమర్పించేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఈ కేసులో కొన్ని సార్లు తాను, మరికొన్ని వ్యాజ్యాల సమయంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని అన్నారు. దీనితో జగన్‌ తోపాటు తదితరుల వ్యాజ్యాలపై కూడా విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు వ్యతిరేకించారు. దీనితో మొత్తంగా నేడు ఈ కేసు క్వాష్ చేయాలని దాఖలైన 5 పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టనుంది.

చెన్నమనేని రమేశ్‌బాబుకు నోటీసు.. ఓటర్ల జాబితాలో నుండి పేరు తొలగింపు ప్రక్రియ ప్రారంభం

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించి ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు వేములవాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం గురువారం అధికారిక నోటీసు జారీ చేసింది. నోటీసును ఆయన నివాసమైన వేములవాడలోని ఇంటి గోడపై అతికించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యత వహిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన నోటీసులో, రమేశ్‌బాబు భారతీయ పౌరుడు కాదని, ఆయనకు జర్మన్ పౌరసత్వం ఉందని హైకోర్టు నిర్ణయించిన తీర్పును ఉదహరించారు.

బనగానపల్లెలో ఘనంగా మొహర్రం వేడుకలు.. పాల్గొన్న మంత్రి

బనగానపల్లెలో మొహర్రం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నవాబు వారసులైన మీర్ ఫజల్ అలీ ఖాన్ లు పాల్గొన్నారు. పట్టణంలోని ఆస్థానాలో హజరత్ అబ్బాస్ ఆలీ బంగారు పీర్లను కొలువుతీర్చారు. ఈ సందర్భంగా మంత్రి పూల షేర దట్టిని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మొహర్రం వేడుకల కోసం జిల్లా మైనార్టీ శాఖ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలు దేశంలో ముంబై తర్వాత బనగానపల్లెలోనే అత్యంత ఘనంగా జరుపుకుంటారు అని చెప్పారు. ప్రతి ఏటా మొహర్రం సందర్భంగా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మత సామరస్యం, సమానతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను ప్రభుత్వ సహకారంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. బనగానపల్లెలో మొహర్రం వేడుకలు ప్రారంభమైన దృష్ట్యా స్థానికులు భారీగా హాజరయ్యారు. మతసామరస్యానికి నిదర్శనంగా ఈ వేడుకలు జరగడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చైనాతో ఉద్రిక్తతలకు ముగింపు దిశగా భారత్‌.. 4 అంశాల ఫార్ములా..

చైనాలో షాంఘై సహకార సంస్థ సమ్మిట్ లో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత బీజింగ్ రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌జున్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దుల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక, ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో బలగాల ఉపసంహరణను కొనసాగించడం, ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, సరిహద్దుల గుర్తింపు-నిర్ధారణ, విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం లాంటి కీలకాంశాలు ఉన్నట్లు పలు జాతీయ మీడియాల్లో కథనాలు ప్రచురితం అవుతున్నాయి.

రాజా హత్య కేసులో ట్విస్ట్! మేజిస్ట్రేట్ ముందు ప్లేట్ ఫిరాయించిన నిందితులు

హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులు ప్లేట్ ఫిరాయించారు. రాజాను చంపిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నేరాన్ని ఉపసంహరించుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా నేరాన్ని అంగీకరించలేదు. మౌనంగా ఉండిపోయారు. దీంతో మేఘాలయ పోలీసులు షాక్‌కు గురయ్యారు. అంతకముందు పోలీసుల విచారణలో రాజాను చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. తీరా కోర్టులో హాజరపరచగా ప్లేట్ ఫిరాయించారు. అయితే తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పోలీసులు చెబుతున్నారు. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ-యూపీకి చెందిన సోనమ్ రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న హంతక ముఠాతో కలిసి భార్య సోనమ్.. భర్తను చంపేసి లోయలో పడేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తీరా చూస్తే నేరాన్ని అంగీకరించలేదు.

అన్నపూర్ణ కేంద్రాలకు పేరు మార్పు.. ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’గా

హైదరాబాద్ నగరంలోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇవి ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా పిలవబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి “అన్నపూర్ణ” పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యను విస్తరించినప్పటికీ, పేరును మాత్రం మార్పు చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, ఈ కేంద్రాలకు ఇందిరా గాంధీ పేరిట ‘ఇందిరా క్యాంటీన్లు’గా పునర్నామకరణ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి మాత్రమే ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. త్వరలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా రూ.5కే అందించేలా చర్యలు చేపడుతున్నారు. భోజన కేంద్రాల మెనూనూ తిరిగి డిజైన్ చేస్తున్నారు — ప్రతి ప్లేట్‌లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూరగాయ కూర, 15 గ్రాముల ఊరగాయను సమతుల్యంగా చేర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జగన్నాథ రథయాత్రలో ఏనుగుల బీభత్సం.. పరుగులు తీసిన జనం

జగన్నాథ రథయాత్రలో ఏనుగుల హల్ చల్ చేశాయి. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ (జూన్ 27న) ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే గుజరాత్‌లోని గోల్‌వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా జనం పైకి దాడి చేసుందుకు పరుగులు పెట్టింది. ఇక, ఒక ఏనుగును చూసి మరొకటి కూడా భక్తుల పైకి దాడి చేసేందుు దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. దీంతో రథయాత్ర సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానిక మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథయాత్రకు సిద్ధం చేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలు అయ్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌ మల్లంపేటలో ఘోర రోడ్డుప్రమాదం.. ఒకటో తరగతి బాలుడు మృతి

హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్‌ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్‌కు తీసుకెళ్తుండగా, ప్రమాదం జరిగింది. పల్లవి స్కూల్ సమీపంలోని జంక్షన్ వద్ద అకస్మాత్తుగా వేగంగా వచ్చిన టిప్పర్‌ స్కూటీకి ఢీకొట్టింది. ఈ ఢీకొట్టే సమయంలో స్కూటీ నుంచి పడిపోయిన అభిమన్యును టిప్పర్‌ తొక్కేయడంతో అతడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

జగన్ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..!

మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురిని పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసులో నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్‌గా దాఖలైన ఈ కేసుపై న్యాయమూర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కోర్టు “పిటిషన్‌లపై నిర్ణయం తీసుకునేంత వరకూ నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని” పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 1కు వాయిదా వేసింది. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో జగన్ వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో జగన్‌తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను కూడా నిందితులుగా చేర్చారు. అందరూ విడివిడిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా, వీటన్నింటినీ ఇవాళ ఒక్కటిగా విచారణ చేయవలిసి ఉంది.

 

Exit mobile version