Site icon NTV Telugu

Top Headlines @9AM :టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. క‌ర్నాట‌క‌లో 8 మంది మృతి

నైరుతి రుతుపవనాలు ఆల‌స్యంగా ప్రవేశించినప్పటికీ ప్రస్తుతం చురుగ్గా క‌దులుతున్నాయి. రుతు పవనాల మూలంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధార‌ణం నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అడపాదడపా కురిసిన వర్షంతో శుక్రవారం సాయంత్రం ముంబ‌యిలోని పలు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. క‌ర్నాట‌క‌లో వాన‌లు దంచికొడుతున్నాయి. భారీ వ‌ర్షాలు కార‌ణంగా రాష్ట్రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు తమ ప్రతాపం చూపుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప‌లు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రానున్న రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జులై 11 వ‌ర‌కు 8 రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది.ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో గోవా, కేరళ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.

బెన్ స్టోక్స్‌ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన చోటు!

యాషెస్‌ సిరీస్‌ 2023లో కీలకమైన మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం ఆటలో మొత్తం 11 వికెట్లు పడడంతో.. మ్యాచ్‌ మలుపులు తిరుగుతూ సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ అరుదైన రికార్డు సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తక్కువ పరుగులే పరిమితం అయినా బెన్ స్టోక్స్‌ మాత్రం 80 పరుగులు చేశాడు. తన బజ్‌బాల్‌ ఆటను ఆస్ట్రేలియాకు మరోసారి రుచి చూపించాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు స్టోక్స్‌ సమయం తీసుకున్నాడు. 168 పరుగుల వద్ద మార్క్‌ వుడ్‌ (24) ఎనిమిదో వికెట్‌ రూపంలో ఔట్ కాగానే.. స్టోక్స్‌ గేర్‌ మార్చాడు. అప్పటికి స్టోక్స్‌ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 39 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఫోర్లు సిక్సులు బాదుతూ 106 బంతుల్లో 80 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

నేపాల్ రాజకీయాల్లోకి భారత్‌ని లాగొద్దు.. మాజీ ప్రధాని వ్యాఖ్యలు..

భారతదేశ వ్యాపారవేత్త తనను ప్రధాని చేయడానికి ప్రయత్నాలు చేశారంటూ నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో అగ్గిరాజేశాయి. ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు నేపాల్ రాజకీయాల్లో భారత్ కలుగజేసుకోవడంపై విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి కూడా ప్రచండను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ప్రచండ వ్యాఖ్యలపై విపక్షాల్లోనే కాకుండా సొంత పార్టీ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచండ వ్యాఖ్యలు నేపాల్ జాతీయ సార్వభౌమాధికారం, జాతీయవాదానికి దెబ్బ అని ఓలి అన్నారు.

వరంగల్‌లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం

ప్రధాని మోడీ నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజిలో ప్రధాని మోడీ సభ విజయ సంకల్ప సభకి ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రతా సిబ్బంది వేదికని అణువణువు తనిఖీ చేస్తున్నారు. 3500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై పోలీసులు నిషేధం విధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ.

తెలంగాణకు వర్షసూచన.. వెదర్ బులిటెన్ విడుదల చేసిన వాతావరణశాఖ

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన ప్రకటనలో తెలిపింది. రేపటి (9)నుంచి 12వ తేదీ వరకు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈరోజు హైదరాబాద్‌లో జల్లులు పడే అవకాశం ఉంది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో 74.8, కొమరం భీం జిల్లా జైనూర్ లో 74, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కర్ణాటకలో అసెంబ్లీలోకి అజ్ఞాతవ్యక్తి .. ఏకంగా ఎమ్మెల్యే సీట్లోనే కూర్చొని ..

సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో పార్టీకి సంబంధంలేనివారు కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు. కొన్ని సందర్భల్లో పార్టీ సమావేశాల్లోకి సైతం కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలా వచ్చిన వారిని పార్టీ నేతలు గుర్తించి బయటకి పంపిస్తుంటారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల్లో కొత్త వ్యక్తులు పాల్గొన్నారంటే సరి.. కానీ రాష్ట్ర అసెంబ్లీలోకి.. అదీ ఎకంగా ఎమ్మెల్యే సీట్లోనే కొత్త వ్యక్తి.. ఎమ్మెల్యే కానీ వ్యక్తి కూర్చుంటే ఎలా ఉంటుంది. ఇది సాధ్యం అవుతదా? అనే సందేహం కలుగుతుంది కదా? కానీ ఇది జరిగింది. కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం ఇటువంటి ఘటన జరిగింది. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు.. అజ్ఞాత వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా!

శుక్రవారం (జూలై 7) ముంబైలో జరిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏషియన్ గేమ్స్ 2023కు భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లను పంపాలని నిర్ణయించారు. అయితే చైనాకు మహిళల పూర్తి స్థాయి జట్టును పంపాలని నిర్ణయించగా.. పురుషుల ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని బోర్డు నిర్ణయించింది. చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య జరుగుతాయి. ప్రస్తుతం భారత మహిళల జట్టుకు ఎలాంటి ఐసీసీ టోర్నీలు లేవు. అందుకే ఏషియన్ గేమ్స్ 2023లో రెగ్యులర్ జట్టును బీసీసీఐ బరిలోకి దింపుతోంది. సెప్టెంబర్ 19 నుంచి మహిళల క్రీడలు ఆరంభం అవుతాయి. మరోవైపు భారత్‌లోనే అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల బీ జట్టు పాల్గొంటుంది. పురుషుల ఆట సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ అప్పగించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

నేడు అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ 2022 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇవ్వనున్నారు.అనంతరం అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయకు ఆయన వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి ఉసా శ్రీచరణ్ పర్యవేక్షించారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి అని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే సొంత‌మని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

మెక్ డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ.. బర్గర్లలో బంద్..

వర్షాభావ పరిస్థితులు, హీట్ వేవ్ కారణాల వల్ల దేశంలో టమాటా పంట దెబ్బతింది. వెరసి దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. కిలో టమాటా ధర రూ. 200లను దాటింది. సామాన్యుడు టమాటాలను కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్ డొనాల్డ్స్ కి కూడా టమాటా దెబ్బ తాకింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తమ స్టోర్లలో బర్గర్లు, రాప్ ల నుంచి టమాటాను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

బర్గర్లు, రాప్ లలో టమాటాలు చాలా కీలకం.. అయితే ఇప్పుడు వాటిలో ఇవి ఉండవన్నమాట. దేశంలో సరఫరాలో సమస్యలు, టమాటా నాణ్యత దెబ్బతినడం, రికార్డు స్థాయిలో ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్ డొనాల్డ్స్ తెలిపింది. నెల వ్యవధిలో టమాటా ధరలు 300-400 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సగటున కిలో టమాటా ధర రూ. 100ని మించింది. రిటైల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు టమాటా వినియోగాన్ని దాదాపుగా తగ్గించుకుంది. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ఏకంగా కిలో టమాటాల ధర రూ. 250కి చేరి రికార్డు సృష్టించింది.

మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందంటే

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం ఉఖ్రుల్‌లో మధ్యాహ్నం 12.14 గంటలకు సంభవించింది. ఉఖ్రుల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. దీని కేంద్రం 70 కి.మీ లోతులో ఉంది.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం గురించి తెలిసిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రకంపనలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ముందు కూడా మణిపూర్‌లో భూకంపం సంభవించింది. మే నెలలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 3.2. షిరుయికి వాయువ్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.

కర్ణాటకను వణికిస్తున్న భారీ వర్షాలు.. పెరుగుతున్న మృతుల సంఖ్య..

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటిమయం అవుతున్నాయి..కర్ణాటక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. భారీ వర్షాలు కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 8కి చేరుకుంది. గత 24 గంటల్లో దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మొత్తం 35 ఇళ్లు ధ్వంసమయ్యాయి.. చాలా మంది తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు..దక్షిణ కన్నడ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఇదే సమయంలో మెస్కాంకు చెందిన 108 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు, 5.02 కిలోమీటర్ల విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతిన్నాయి.. దాంతో ఆ ప్రాంతమంతా చీకటిలోనే ఉండిపోయింది..

శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందడంతో జంట తీర జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉడిపిలో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకా నందవర గ్రామంలో కొండ భాగం కూలి 47 ఏళ్ల మహిళ మృతి చెందింది. శిథిలాల నుంచి ఆమె 20 ఏళ్ల కుమార్తెను రక్షించారు. ఉడిపి జిల్లాలో గురువారం రాత్రి కర్కల-పడుబిద్రి రాష్ట్ర రహదారిపై బెల్మన్ పట్టణం గుండా వెళ్తుండగా భారీ చెట్టు వాహనంపై పడటంతో బైక్ రైడర్ ప్రాణాలు కోల్పోయాడు.. ఇలా ఒక్కొక్కరు ప్రాణాలను కోల్పోతున్నారు.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరిందనీ, దక్షిణ కన్నడలో ఐదుగురు, ఉడిపిలో ముగ్గురు మరణించారని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.

Exit mobile version