Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మిథున్ రెడ్డి అరెస్ట్‌పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్‌లో షాకింగ్ అంశాలు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ కీలక అంశాలు పేర్కొంది. స్కాంలో మిథున్ రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించాం.. కుంభకోణం మొదలు నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా ఉన్నారు.. కేసులో ఏ3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్య ప్రసాద్ కు నాన్ కేడర్ ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తానని హామీ ఇచ్చి కుట్ర అమలు చేయించారు అని సిట్ తెలిపింది. స్కాం అమలు కోసమే సత్య ప్రసాద్ ను ప్రత్యేక అధికారిగా నియమించారు.. కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్ లను నేరుగా మిథున్ రెడ్డి ప్రభావితం చేశారు.. ఈ ఇద్దరు గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖలో కీలక పొజిషన్ లో ఉన్నారు.. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరే విధంగా వారికి మిథున్ రెడ్డి సూచనలు చేశారు అని సిట్ పేర్కొంది.

రాజీనామా చేయ్యమంటే చేస్తా.. ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను అస్సలు వెళ్లను తెలపారు. తాను ఏ పార్టీలో చేరను అని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అని, ఎమ్మెల్యే పదవికీ బీజేపీ రాజీనామా చేయ్యమంటే చేస్తాను అని చెప్పారు. గోషామహల్‌లో ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు.

నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్‌కు థరూర్ షాక్..

తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్‌కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీల కన్నా దేశం ముఖ్యమని చెప్పారు. ఎవరికైనా దేశం ముందు ఉంటుందని, పార్టీలు కేవలం దేశాన్ని నిర్మించే సాధానాలు మాత్రమే అని చెప్పారు.

వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుద్ది.. నిర్మాత కాన్ఫిడెన్స్..

హరిహర వీరమల్లు మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత ఏఎం రత్నం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ ఒక్క ఇంటర్వ్యూలో పాల్గొనలేదు. కానీ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి హైప్ పెంచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీ గురించి తన కాన్ఫిడెన్స్ బయట పెట్టారు. నేను ఎన్నో సినిమాలన నిర్మించాను. కానీ నా సినీ కెరీర్ లో ఎక్కువకాలం జర్నీ చేసింది మాత్రం ఈ సినిమాతోనే. ఈ మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్, సెట్స్ వాడేశాం. ఈ మూవీకి అవే అతిపెద్ద బలం. అందుకే ఇంత ఆలస్యం అయింది.

పార్లమెంట్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’పై చర్చించేందుకు కేంద్రం సిద్ధం..

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.

పునర్విభజనలో తక్కువ సీట్లు కేటాయిస్తామని అనడం అన్యాయం కాదా?

జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చా కార్యక్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజకీయాలు, నియోజకవర్గ పునర్విభజన, భాషా విధానాలు వంటి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ఓటర్ల సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం, పార్లమెంటు సీట్ల కేటాయింపులోని అసమానతలపై విస్తృతంగా మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ, “బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. కానీ ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇండియా లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక్క వ్యక్తి ఓటు కోల్పోయినా దాని మీద చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.

మిథున్ రెడ్డి అరెస్టుపై స్పందించిన తమ్మినేని సీతారాం..

ఆమదాలవలస వైసీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం నిర్వహించారు. మిథున్ రెడ్డి అరెస్టుపై ఆయన స్పందించారు. వంశీ, పూసాన కృష్టమురళి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా అనేక మంది నాయకులు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు, హత్యలు పెరుగుతున్నాయని.. ప్రభుత్వం ఉందా అనిపిస్తుందన్నారు. జగన్ రూ.3.30 లక్షలు కోట్లు అప్పు చేస్తే అందులో రూ. 2.50లక్షల కోట్లు ప్రజలకు సంక్షేమం అందించారని స్పష్టం చేశారు. జగన్ అన్ని వర్గాలకు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ. 1.8 లక్షల కోట్లు అప్పు చేసిందని.. అప్పుచేసిన డబ్బులు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“త్వరలో అతిపెద్ద తిమింగలం”.. లిక్కర్‌ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు..

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయి.. అన్ని ఆధారాలతో త్వరలో పెద్ద తిమింగళం బయట పడుతుందన్నారు. గతంలో అడ్డంగా దోచుకుని జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. కూటమి వచ్చాక 500 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి కళ్లెం వేశామని తెలిపారు. రాష్ట్రంలో తక్కువ దొరకే నాణ్యమైన మద్యం అందుతుందన్నారు. రాష్ట్రంలో మద్యంతో పాటు ఇంకా అనేక కుంభకోణాలు బయటికి వస్తున్నాయని చెప్పారు.

భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..

తమిళనాడులో దారుణం జరిగింది. భార్యపై కోపంతో ఏకంగా ఆమెను పొడిచి చంపేశాడు ఓ భర్త. రాష్ట్రంలోని కరూర్ జిల్లాలోని కులితలై ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడిని విశృత్‌గా గుర్తించారు. ఘటన తర్వాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శనివారం రాత్రి విశృత్ అతడి భార్య 27 ఏళ్ల శ్రుతి మధ్య కరూర్‌లోని వారి ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో శ్రుతిపై విశృత్ దాడి చేశాడు. దీంతో ఆమెను చికిత్స కోసం కులితలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆదివారం ఉదయం ఆమెను చూసే నెపంతో, విశృత్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. శ్రుతిని అనేక సార్లు పొడిచి, ఆమెను అక్కడిక్కడే చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆస్పత్రి సిబ్బంది, చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. అతడిని పట్టుకునే లోపే పారిపోయాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్..

మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్‌ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్‌, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్‌ కోర్టుకు నివేదించింది. సెక్షన్‌ 409, 420, 120(బీ), రెడ్‌విత్‌ 34, 37, ప్రివెన్షన్‌ ఆప్‌ కరెప్షన్‌ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.

 

Exit mobile version