భానుడి భగభగతో తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఉదయం నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవికాలం ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో తెలంగాణ వాసులు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో ఎండతీవ్రత అంచనాలకు మించి ఉండడంతో విద్యాసంస్థల పనివేళల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భాగ్యనగరంలో ఉక్కపోతకు ప్రజలు చెమటలు కక్కుతున్నారు.
హై స్పీడ్‌లో ఫ్యాన్‌లు, కూలర్లు, ఏసీలు నడిచినా ఫలితం లేకుండా పోతున్న వేళ.. నేనున్నా అంటూ.. వరుణుడు గురువారం భాగ్యనగరవాసులను పలుకరించాడు. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని నగరమంతా చల్లబడింది. అంతేకాకుండా పలుచోట్ల ఈదురుగాలులు, వర్షం కురిసింది. బంజారహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, షేక్‌పేట్, మోహదీపట్నం, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా పలు చోట్ల మోస్తరు వర్షం నమోదైంది. వేసవికాలం ప్రారంభం నుంచి ఎండలకు మండిపోతున్న ప్రజలకు గురువారం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.
