హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు భాగ్యనగరంలో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో.. చరిత్రాత్మక హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.
అయితే.. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మీ, గౌలిపురా కోటమైసమ్మ, ఆలియాబాద్ దర్బార్ మైసమ్మ దూద్‌బౌలి పయనీర్ ముత్యాలమ్మ, మీర్ ఆలం మండి మహంకాళేశ్వర మందిరంలో వేలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈకార్యక్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని.. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, ప్రధాన ఆలయాల్లో పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బోనాలు నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లాల్‌దర్వాజా బోనాల వేడుకల్లో పాల్గొననున్నారు. సింహవాహిని అమ్మవారి బోనాల్లో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొంటారు.
