రాజేంద్రనగర్‌లో 7 సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్‌మెంట్ లో నివాసం ఉంటున్న అనీష్ అనే బాలుడు అపార్ట్‌మెంట్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సాయంత్రం గుర్తించి హుటాహుటిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ సమీపంలో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొనిపోతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అపార్ట్‌మెంట్‌లో కూడా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పది రోజుల నుంచి పనిచేయకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడు కిడ్నాప్ అవ్వడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.