NTV Telugu Site icon

Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం

Manhole

Manhole

Medchal news: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో సంతోష్ అనే బాలుడి మృతదేహం కలకలం రేపింది. కొండాపూర్‌లోని వాసవి వెంచర్‌లోని మ్యాన్‌హోల్‌లో మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు.

మూడు రోజుల క్రితం వర్షం కురుస్తున్న సమయంలో సంతోష్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే బాలుడు ఎక్కడా కనిపించకపోవడంతో భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే సమీపంలోని కొండాపూర్ చెరువులో జారిపడి ఉండవచ్చన్న అనుమానంతో రెస్క్యూ టీంలు రెండు రోజులుగా చెరువులో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చెరువులోకి గజ ఈతగాళ్లను ప్రయోగించి బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నిన్న వాసవీ వెంచర్‌లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే బాలుడి మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సంతోష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే బాలుడు ఎలా మృతి చెందాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడవేశారా? లేక ఆ బాలుడు వర్షంలో జారి మ్యాన్‌హోల్‌లో పడ్డాడా? పోలీసులు విచారిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం కుండపోత వర్షం కురుస్తుండడంతో బాలుడు బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంటికి రాలేదని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు బాలుడు మ్యాన్‌హోల్‌లో జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంటికి దూరంగా ఉన్న మ్యాన్ హోల్ వద్దకు బాలుడు ఎలా వెళ్లాడు అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు

Show comments