Site icon NTV Telugu

TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన

Tgsrtc Recruitment 2026

Tgsrtc Recruitment 2026

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సంస్థ ఎండీ నాగిరెడ్డి గారు అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేశారు. కార్మికులు ఎవరూ మాయ మాటలు నమ్మి సమ్మెకు వెళ్లవద్దని, అనాలోచిత నిర్ణయాలతో తమ ఉద్యోగ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవద్దని ఆయన హితవు పలికారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందని, అందులో భాగంగానే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం లేబర్ కమిషనర్ వద్ద చర్చలు కొనసాగుతున్న తరుణంలో సమ్మెకు పిలుపునివ్వడం చట్టరీత్యా చెల్లదని, ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

చర్చల ప్రక్రియ చురుగ్గా సాగుతున్న సమయంలో చట్టవిరుద్ధంగా సమ్మెకు వెళ్లడం సరైంది కాదని, అటువంటి నిరసనల్లో పాల్గొనే వారిపై సంస్థ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎండీ హెచ్చరించారు. ముఖ్యంగా సమ్మెలో పాల్గొన్న వారికి వేతన కోతతో పాటు ఉద్యోగ నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న అనధికారిక పిలుపులను , తప్పుడు ప్రచారాలను నమ్మి కార్మికులు ఆందోళనకు గురికావద్దని, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరూ యధావిధిగా విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఏ చర్యలైనా సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన గట్టిగా పునరుద్ఘాటించారు.

TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?

Exit mobile version