TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) తమ బస్సు టికెట్ ధరలను 50 శాతం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వార్తలను ఖండించింది. సాధారణ ప్రయాణికులకు వర్తించే టికెట్ చార్జీలు యథాతథంగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది.
ఈ ధరల పెంపు కేవలం ప్రత్యేక బస్సు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నడిపే ప్రత్యేక బస్సు సర్వీసులలో మాత్రమే ధరల సవరణ ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులలో, ప్రయాణికులను తీసుకెళ్లిన తర్వాత ఖాళీగా తిరిగి వచ్చే బస్సుల డీజిల్ ఖర్చులను భరించేందుకు మాత్రమే ఈ ధరలను పెంచుతారని వివరించారు. ఈ నిబంధనలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం 2003 నుంచి అమలులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ప్రజలు అటువంటి అపోహలను నమ్మవద్దని టీజీఎస్‌ఆర్‌టీసీ కోరింది. సాధారణంగా రోజువారీగా నడిచే బస్సుల్లో టికెట్ ధరలు పెంచే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవని స్పష్టం చేసింది. సాధారణ బస్సులు, ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, గరుడ, సూపర్ లగ్జరీ వంటి అన్ని సర్వీసులలో సాధారణ చార్జీలే వర్తిస్తాయని అధికారులు తెలియజేశారు.
ఈ ప్రకటనతో, టికెట్ ధరల పెంపు గురించి ప్రయాణికులలో ఉన్న గందరగోళానికి టీజీఎస్‌ఆర్‌టీసీ తెరదించింది. భవిష్యత్తులో కూడా ఏవైనా మార్పులు ఉంటే, అధికారిక ప్రకటనల ద్వారా మాత్రమే ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని సంస్థ స్పష్టం చేసింది.
ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎడీఎస్ అనిల్ చౌహాన్!
