Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్‌చేంజ్.!

  • భారీ సినిమాలకు టికెట్ ధరల పెంపు
  • 25% సీట్లు నాన్-ప్రేమియం తప్పనిసరి
  • రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్
  • సినీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి
Tfi

Tfi

తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి , పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త జీవో (GO) విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ‘యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ (ATFPG) స్వాగతిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఐమాక్స్ (IMAX), డాల్బీ సినిమా, హెచ్‌డీఆర్ వంటి అత్యధునిక సాంకేతికతలతో నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమవుతాయి. ఈ పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం, అర్హత ఉన్న సినిమాల టికెట్ ధరల పెంపునకు ఒక స్పష్టమైన, నియంత్రిత విధానాన్ని అందించడం ఒక ప్రగతిశీల నిర్ణయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

నియంత్రిత టికెట్ ధరలు , సాధారణ ప్రేక్షకులకు ఉపశమనం

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో టికెట్ ధరల పెంపు అనేది ప్రతీ సినిమాకూ స్వయంచాలకంగా వర్తించదు. కేవలం అర్హత ఉన్న భారీ చిత్రాలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది , ప్రభుత్వ అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తారు. అదే సమయంలో సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండేలా థియేటర్ ఏసీ, నాన్-ఏసీ, స్పెషల్ లేదా మల్టీప్లెక్స్ ఏదైనా సరే మొత్తం సీట్లలో 25% సీట్లను తప్పనిసరిగా నాన్-ప్రేమియం కేటగిరీకే కేటాయించాలనే నిబంధనను విధించారు.

5 షోలకు అనుమతి , సినీ కార్మికుల సంక్షేమ నిధి

థియేటర్లలో రోజుకు 5 ప్రదర్శనలకు (Shows) అనుమతి ఇవ్వడం వల్ల పెద్ద సినిమాలకు ఉండే విపరీతమైన డిమాండ్ త్వరగా తగ్గుతుంది. దీని ద్వారా థియేటర్లపై ఒత్తిడి తగ్గి, చిన్న , మధ్య తరహా బడ్జెట్ సినిమాలకు ఎక్కువ స్క్రీన్లు లభించే అవకాశం ఉంటుంది. దీనికి తోడు, సినిమా రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది సినీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి కూడా ఈ కొత్త విధానం ఎంతగానో దోహదపడుతుంది.

పరిశ్రమ భవిష్యత్తుకు బలమైన పునాది

ఈ కొత్త జీవో కేవలం టికెట్ ధరల పెంపునకు మాత్రమే పరిమితం కాకుండా నూతన పెట్టుబడులను, కొత్త సాంకేతికతను, చిన్న సినిమాలను , వేలాది మంది సినీ కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ఒక బలమైన వ్యవస్థను నిర్మిస్తుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. తెలుగు సినిమా మరింతగా విస్తరిస్తున్న సమయంలో, పరిశ్రమపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు, ప్రకాశవంతమైన భవిష్యత్తు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.