Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ

  • కరువు పరిస్థితులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • జలాశయాల్లో భారీగా తగ్గిన నీటి నిల్వలు
  • కృష్ణా జలాల్లో 50:50 వాటాపై తెలంగాణ పట్టు
  • కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై మంత్రి కీలక వ్యాఖ్యలు
Uttam

Uttam

రాష్ట్రంలో ప్రబలిన వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కరువు తీవ్రతకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలతో పాటు గ్లోబల్ ‘ఎల్ నినో’ ప్రభావమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తమది రైతు ప్రభుత్వమని, ఏ ఒక్క అన్నదాతనూ ఒంటరిగా వదలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

రైతులకు ముందస్తు అవగాహన.. ప్రాజెక్టులకు వాటర్ బడ్జెట్

ఎల్ నినో తీవ్రత వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, సాగునీటి కొరత తలెత్తకుండా పంటల ఎంపికపై రైతులకు ముందస్తు సూచనలు అందించామని మంత్రి తెలిపారు. ఆయకట్టు వారీగా నీటి లభ్యతపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ, ప్రతి మంగళవారం ‘రైతు నేస్తం’ ద్వారా జలాశయాల స్థితిగతులను ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. ప్రజావసరాల దృష్ట్యా తాగునీటికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఆ తర్వాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నీటి బడ్జెట్ అమలు చేస్తూ, ప్రతి పది రోజులకోసారి జలాశయాల నిల్వలను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

భారీగా తగ్గిన నీటి నిల్వలు.. వాస్తవాలను దాచం

గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గాయని మంత్రి గణాంకాలతో వివరించారు. శ్రీశైలంలో గత ఏడాది 153.56 టీఎంసీల వినియోగయోగ్యమైన నీరు ఉండగా, ప్రస్తుతం అది 61.65 టీఎంసీలకు పడిపోయిందన్నారు. అలాగే నాగార్జునసాగర్‌లో గత ఏడాది ఉన్న 174.25 టీఎంసీలతో పోలిస్తే ప్రస్తుతం కేవలం 44.89 టీఎంసీలు మాత్రమే లభ్యతలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 44,034 చెరువుల్లో దాదాపు 40 శాతం చెరువులు పావు వంతు సామర్థ్యం కంటే తక్కువగానే నిండాయని, ఈ వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో 50:50 వాటాపై పట్టు

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో తాత్కాలికంగా కుదుర్చుకున్న 66:34 నిష్పత్తిని శాశ్వత హక్కుగా అంగీకరించేది లేదని, కృష్ణా జలాల్లో 50:50 పంపిణీ కోసం ట్రిబ్యునల్, కేఆర్‌ఎమ్‌బీ మరియు కేంద్ర ప్రభుత్వం వద్ద బలంగా వాదిస్తున్నామని చెప్పారు.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డిలపై వాస్తవాలు

గత పాలకుల నిర్మాణ వైఫల్యాల వల్లే కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగంగా మారిందని మంత్రి ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం నీటి నిల్వకు సురక్షితం కావని ఎన్డీఎస్ఏ (NDSA) తేల్చి చెప్పిందని, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వాటిని వినియోగించలేమని తేల్చి చెప్పారు. చిన్న మరమ్మతులతో కాళేశ్వరాన్ని నడపవచ్చనడం సాంకేతికంగా తప్పని, ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారమే పునరుద్ధరణ చేపడతామన్నారు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్న లింక్-2 ద్వారా పంపింగ్ కొనసాగిస్తున్నామన్నారు. మరోవైపు పాలమూరు–రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయిందన్న బీఆర్ఎస్ ప్రచారం అవాస్తవమని, కేవలం పంప్‌హౌస్‌లు కడితే ప్రాజెక్టు పూర్తి కాదని, కాలువలు, భూసేకరణ పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా దాన్ని వినియోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు.