Site icon NTV Telugu

Vehicle Life Tax : తెలంగాణలో వాహనాలపై లైఫ్‌టాక్స్ పెంపు

Life Tax

Life Tax

Vehicle Life Tax : తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్‌టాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం.53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు రెండు, మూడు, నాలుగు చక్రాల నాన్‌-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్‌టాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రూ.50 వేలు లోపు ధర కలిగిన రెండు చక్రాల వాహనాలపై ఇప్పుడు 9 శాతం పన్ను విధించనున్నారు. రూ.50 వేలు నుంచి ఒక లక్ష వరకు ఉన్న బైకులపై 12 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. ఒక లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో ఉన్న వాహనాలపై 15 శాతం, రెండు లక్షలకు పైబడిన వాటిపై 18 శాతం లైఫ్‌టాక్స్ వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ.1.10 లక్షల బైక్ కొంటే ఇంతకుముందు రూ.13,200 పన్ను ఉండగా, ఇప్పుడు అది రూ.16,500కి పెరిగింది.

Nara Lokesh meet Jaishankar: డేటా సిటీ ఏర్పాటుకు సహకరించండి.. జైశంకర్‌ను కోరిన లోకేష్‌

నాన్‌-ట్రాన్స్‌పోర్ట్ నాలుగు చక్రాల వాహనాలపై కూడా ప్రభుత్వం భారీగా పన్ను పెంచింది. ఐదు లక్షలలోపు ధర కలిగిన కార్లపై 13 శాతం, పది నుంచి ఇరవై లక్షల మధ్య కార్లపై 18 శాతం, ఇరవై నుంచి యాభై లక్షల మధ్య వాహనాలపై 20 శాతం, యాభై లక్షలకు పైబడిన లగ్జరీ కార్లపై 21 శాతం లైఫ్‌టాక్స్ అమల్లోకి తెచ్చారు. అదనంగా కంపెనీల పేరుతో కొనుగోలు చేసే వాహనాలు, రెండో వాహనాలపై మరింత ఎక్కువ పన్ను విధించనున్నారు. కొన్ని కేటగిరీలలో ఇది 25 శాతం వరకు ఉండొచ్చు.

అయితే విద్యుత్ వాహనాలకు మినహాయింపు ఇచ్చి వాటిపై ఎలాంటి లైఫ్‌టాక్స్ వసూలు చేయరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రాయితీ 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ పెంపుతో ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.4,350 కోట్ల ఆదాయాన్ని లైఫ్‌టాక్స్ రూపంలో సమీకరించనుందని అంచనా. కానీ ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలపై ఇది మరింత భారమని, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోతారని ఆయన వ్యాఖ్యానించారు. కార్లపై అదనంగా 20 నుంచి 25 వేల రూపాయల వరకు భారం పడుతుందని ఆయన ఉదహరించారు. ఇక ఆటోమొబైల్ రంగం ప్రతినిధులు కూడా ఈ పెంపు పండుగ సీజన్‌ సేల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికను హతమార్చిన దుండగులు..!

Exit mobile version