Site icon NTV Telugu

Telangana Students Died: అమెరికాలో ఒకరు మృతి.. జర్మనీలో మరొకరు గల్లంతు

Dead Body

Dead Body

కోటి ఆశలతో విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్ధులు ప్రమాదాలకు గురై తిరిగిరాని లోకాలకు చేరారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 7న యూఎస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరణ్‌ రెడ్డి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళారు. అఖిల్ ఆచూకీ కోసం జర్మన్ రాయబార కార్యాలయానికి కేంద్రం లేఖ రాసింది.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా విద్యార్థి క్రాంతి కిరణ్‌రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్‌రెడ్డి (25) వారెన్స్‌బగ్‌లోని మిస్సోరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 7న స్నేహితులతో కలిసి వెళ్తుండగా, వీరి కారును ఓ కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కిరణ్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కిరణ్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయబార కార్యాలయం ద్వారా తెలంగాణ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విషాదం నుంచి తేరుకునేలోపే తెలంగాణకే చెందిన కడారి అఖిల్ (25) అనే యువకుడు జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యాడు. కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు అఖిల్ 2018లో జర్మనీకి వెళ్లాడు. ఈ నెల 8న ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత అఖిల్ కనిపించకుండా పోయాడని సమాచారం అందింది. అతని ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, తన సోదరుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలంటూ అఖిల్ సోదరి మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని కేంద్రానికి తెలిపింది. అఖిల్ గల్లంతు ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ శాఖ బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. ఇద్దరు విద్యార్ధుల ఘటనలు ఆయా కుటుంబాలను కలిచి వేస్తున్నాయి.

Loud Speakers row: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం… లౌడ్ స్పీకర్లపై నిషేధం

Exit mobile version