అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ విద్యార్థిని అదృశ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. తెలంగాణకు చెందిన 23 ఏళ్ల యువతి అమెరికాలోని బోస్టన్‌లో అనుమానాస్పద రీతిలో కనిపించకుండాపోయింది. ఉన్నత విద్య కోసం వెళ్లిన ఈ యువతి గల్లంతు కావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలిని తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లపురం గ్రామానికి చెందిన శ్రీజ రెడ్డిగా గుర్తించారు.
వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన శ్రీజ
శ్రీజ రెడ్డి ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్లగా.. అక్కడే చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తోంది. ఇటీవలే స్వదేశానికి వచ్చి నెల రోజులు కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి అమెరికా వెళ్ళింది. నవంబర్ 2న ఆమె చివరిసారిగా కనిపించింది. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి తన గదికి తిరిగి వచ్చిన శ్రీజ.. ఆ తర్వాత వాకింగ్ కోసం బయటకు వెళ్లింది. కేవలం ఒక కిలోమీటరు నడిచిన తర్వాత ఆమె అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. అప్పటి నుంచి ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో భయం పట్టుకుంది.
రంగంలోకి దిగిన బోస్టన్ పోలీసులు.. మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ
శ్రీజ కనిపించడం లేదంటూ నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు అందగా.. వెంటనే స్పందించిన బోస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నవంబర్ 4న అధికారికంగా మిస్సింగ్ అలర్ట్ జారీ చేసింది. ఆమెను వెతికి పట్టుకోవడంలో ప్రజల సహాయం కోరింది. శ్రీజ కార్సన్ బీచ్ లేదా హార్బర్ పాయింట్ ప్రాంతంలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె గదికి అతి సమీపంలోనే ఈ ప్రాంతం ఉండటంతో ఆ కోణంలోనూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శ్రీజ ఆచూకీ కోసం ఆమె తండ్రి కోయ యాదగిరి రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ కుమార్తె క్షేమంగా తిరిగి రావాలని ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, ఈ ఘటనపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. శ్రీజను సురక్షితంగా రక్షించే ప్రయత్నాల్లో భాగంగా బోస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు బోస్టన్ పోలీసుల సహాయం కోరారు. అలాగే గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’ (తానా) ప్రతినిధులను కూడా ఆయన సంప్రదించి సమన్వయం చేస్తున్నారు. శ్రీజ చివరిసారిగా నల్లని జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

