Site icon NTV Telugu

DGP Mahender Reddy : పోలీస్ సంక్షేమానికై తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ

దాదాపు ఒక లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమానికై మరో ముందగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్ శాఖ ప్రతీ అధికారి, సిబ్బంది తమ పదవీ విరమణలోగా కనీసం ఒక ఇంటిని లేదా ఫ్లాట్ ను కలిగి ఉండేలా తగు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ‘తెలంగాణా స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ నిర్వహణా తీరు, దీని ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలపై డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నేడు రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ. లు, యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అడిషనల్ డీజీ లు ఉమేష్ షరాఫ్, జితేందర్ లు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్ అధికారుల సంక్షేమానికై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని దీనిలో భాగంగానే తెలంగాణా స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటుకు అనుమతించడమే కాకుండా ఆదాయం పన్ను మినహాయింపు లభించేలా సహకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య భద్రతా మాదిరిగానే పోలీసులకు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి గారిని కోరగా, ఇందుకై ప్రత్యేకంగా మూల ధనాన్ని పెంపొందించుకునేందుకై పోలీస్ శాఖ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ పంపులు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికై సి.ఎం అనుమతిచ్చారని తెలిపారు.

దీనిలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకంగా తెలంగాణా స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఈ సొసైటీ కి స్వచ్ఛందంగా విరాళాలు అందించేవారికి, వివిధ కార్యక్రమాల ద్వారా పొందే ఆదాయానికి 80 జి, 12 ఏ కింద ఆదాయం పన్ను మినహాయింపు లభించిందని డీజీపీ చెప్పారు. ఈ సొసైటీ కి సమకూరే నిధులనుండి పోలీసు అధికారులకు ఇల్లు లేదా ఫ్లాట్ ల కొనుగోలు కు నామమాత్ర వడ్డీపై రుణాలను అందించనున్నట్టు వివరించారు.

Exit mobile version