Site icon NTV Telugu

TG 10th Exams : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి టైం టేబుల్ ఇదే..!

Ssc Exams

Ssc Exams

TG 10th Exams : తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కీలకమైన ఎస్‌ఎస్‌సీ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. 2026 మార్చి నెల 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి టైమ్‌టేబుల్‌ను విడుదల చేస్తూ, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ షెడ్యూల్ ప్రకారం ప్రతి పరీక్షకు మధ్య మూడు రోజుల గ్యాప్‌ను కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు ఒక పరీక్ష నుంచి మరో పరీక్షకు సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని బోర్డు పేర్కొంది. గతంలో ఒకటి లేదా రెండు రోజుల గ్యాప్‌తో పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ఈసారి గ్యాప్‌ను పెంచామని అధికారులు వెల్లడించారు.

Duddilla Sridhar Babu : భారత్ ఫ్యూచర్ సిటీతో 13 లక్షల మందికి ఉద్యోగాలు

మార్చి 14న మొదటి భాష పరీక్షతో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత రెండో భాష, మూడో భాష (ఆంగ్లం), గణితం, సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్), సామాజిక శాస్త్రం పరీక్షలు వరుసగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 13న చివరిగా సోషల్ స్టడీస్ పరీక్షతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎక్కువ భాగం పరీక్షలు జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. సైన్స్ అంశాలకు సంబంధించిన పరీక్షలకు నిర్ణీత సమయం కొద్దిగా భిన్నంగా ఉంటుందని అధికారులు తెలియజేశారు. వృత్తి విద్య (వొకేషనల్) విద్యార్థులు, ఓపెన్ స్కూల్ (OSSC) విద్యార్థులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రశ్న పత్రాల గోప్యతకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే హాల్‌టికెట్ల పంపిణీ, పరీక్ష కేంద్రాల కేటాయింపును ముందుగానే పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులు పరీక్షల టైమ్‌టేబుల్‌ను గమనించి, ప్రణాళికబద్ధంగా చదువు కొనసాగించాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడమే లక్ష్యంగా ఈ షెడ్యూల్‌ను రూపొందించినట్లు బోర్డు స్పష్టం చేసింది.

Arunachal Pradesh: అక్రమ బంగ్లాదేశీయులపై తిరగబడుతున్న అరుణాచల్ ప్రజలు..

Exit mobile version