Telangana Sports Minister Srinivas Goud Gives Strong Warning To HCA: ఈనెల 25వ తేదీన ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం విషయంపై తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని.. ఒకవేళ టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అసోసియేషన్ ఉన్నది కేవలం పది మంది అనుభవం కోసం కాదని, ఉప్పల్ స్టేడియం కోసం ప్రభుత్వం 23 ఎకరాలు ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తే.. సీఎం కేసీఆర్ సహించరని హెచ్చరించారు.
టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని.. టికెట్స్ అమ్మకాలపై క్రీడాశాఖ, పోలీస్ శాఖలు నిఘా ఉంచాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రేపు ఉప్పల్ స్టేడియాన్ని తాను పరిశీలిస్తానని అన్నారు. టికెట్స్ బ్లాక్ దందా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. తెలంగాణ పరువు తీస్తే ఏమాత్రం సహించేదే లేదని తెగేసి చెప్పారు. స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు అమ్మారనే దానిపై తాము లెక్కలు తేల్చుతామని స్పష్టం చేశారు. మ్యాచ్ టికెట్ల అమ్మకంపై అన్ని వివరాలు చెప్పాలని హెచ్ సీఏని సూచించారు. కాగా.. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు జిమ్‌ఖానా గ్రౌండ్స్ వద్ద ఏ స్థాయిలో తరలివచ్చారో అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలోనే టికెట్ల అవకతవకలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవ్వడంతో, క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ పైవిధంగా సీరియస్ అయ్యారు.
