రాష్ట్రంలో సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించి అందిన వివిధ ఫారాల (ఫారం-6, 6A, 7, 8) గణాంక వివరాలను భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా విడుదల చేసింది. ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే ఓటర్ల రికార్డులను అప్‌డేట్ చేస్తున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.
ఫారం-6, 8 లలోనే అత్యధిక దరఖాస్తులు
నూతన ఓటరు నమోదు కోసం ఉద్దేశించిన ఫారం-6 కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,88,417 దరఖాస్తులు స్వీకరించగా, వాటిని పరిశీలించిన అధికారులు ఇప్పటివరకు 51,821 మంది ఓటర్ల రికార్డులను అధికారికంగా అప్‌డేట్ చేశారు. ఇక ఓవర్సీస్ ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం-6A ద్వారా 6,270 దరఖాస్తులు రాగా, అందులో 118 రికార్డులను నామినేట్ లేదా అప్‌డేట్ చేశారు. మరోవైపు చిరునామాల మార్పు, తప్పుల సవరణకు సంబంధించి ఫారం-8 ద్వారా అత్యధికంగా 5,05,159 దరఖాస్తులు రాగా, వీటిలో 2,27,721 రికార్డులను అధికారులు విజయవంతంగా సవరించారు.
ఓట్ల తొలగింపునకు 24 వేల దరఖాస్తులు.. 12,204 ఓట్లు డిలీట్
అనర్హులైన ఓటర్ల తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఉద్దేశించిన ఫారం-7 కింద రాష్ట్ర వ్యాప్తంగా 24,323 దరఖాస్తులు వచ్చాయని సీఈఓ సీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హత లేని 12,204 ఓటర్ల పేర్లను జాబితా నుంచి డిలీట్ చేసినట్లు వివరించారు. కాగా, గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి. కొత్త ఓటర్ల నమోదు కోసం హైదరాబాద్ జిల్లా నుంచి ఫారం-6లో అత్యధికంగా 1,94,204 దరఖాస్తులు వచ్చాయి. అలాగే హైదరాబాద్ పరిధిలోనే ఫారం-7 కింద అత్యధికంగా 6,335 దరఖాస్తులు రాగా, పరిశీలన అనంతరం అధికారులు 2,066 ఓట్ల తొలగింపు పూర్తి చేశారు.

