Telangana Sheep Distribution Scam : తెలంగాణలో అమలైన “గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం (SRDS)”లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002 కింద దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తులో పలువురు ప్రభుత్వ అధికారులు, మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల పాత్ర బయటపడింది.
ఈడీ హైదరాబాద్ జోన్ కార్యాలయం జూలై 30న నిర్వహించిన సోదాల్లో ముఖ్యంగా మాజీ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి అప్పట్లో OSDగా ఉన్న జి.కళ్యాణ్ కుమార్ నివాసాన్ని సోదాలు చేశారు. అలాగే పథకంలో భాగంగా చెల్లింపులు పొందిన లబ్ధిదారులు, మధ్యవర్తుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.
ఈడీ తన దర్యాప్తును తెలంగాణ ACB నమోదు చేసిన రెండు FIRల ఆధారంగా ప్రారంభించింది. ఒక కేసులో మాజీ మంత్రికి చెందిన OSD పాత రికార్డులను లంచబద్ధంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో కేసులో ఓ గొర్రెల వ్యాపారి రూ.2.1 కోట్ల చెల్లింపులు తమ ఖాతాకు రావాల్సి ఉన్నా, అవి ఇతర ఖాతాల్లోకి మళ్లించబడ్డాయని ఫిర్యాదు చేశారు.
కాగా, 2021 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన CAG ఆడిట్ నివేదికలోనూ గొర్రెల పంపిణీ పథకంలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. అందులో భాగంగా మృతుల పేర్లకు యూనిట్లు కేటాయించడం, నకిలీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల వివరాలు చూపించడం, వాస్తవ లబ్ధిదారులకు కాకుండా ఇతరుల ఖాతాల్లోకి నిధుల మళ్లింపులు ఉన్నాయని వెల్లడైంది. ఈ నివేదిక కేవలం 7 జిల్లాలకు పరిమితమవగా, అందులోనే రూ.253.93 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది. ఈ లెక్కను 33 జిల్లాలకు విస్తరించి చూస్తే, మొత్తం నష్టం రూ.1000 కోట్లను దాటి ఉండే అవకాశముందని ఈడీ అంచనా వేసింది.
ఈడీ సోదాల్లో తేలిన మరిన్ని కీలక అంశాలు ఏమిటంటే, ప్రభుత్వ నిధులు నకిలీ వ్యక్తులు/సంస్థల ఖాతాల్లోకి మళ్లించబడ్డాయి. వాస్తవంగా గొర్రెల కొనుగోలు లేదా అమ్మకం జరగకపోయినా, నకిలీ వౌచర్లు చూపిస్తూ పాత యూనిట్లను తిరిగి ఉపయోగించి నిధులను దుర్వినియోగం చేసినట్టు గుర్తించారు.
ఇక సోదాల్లో స్వాధీనం చేసుకున్న 200కు పైగా పాస్‌బుక్లు, ఖాళీ చెక్కు పుస్తకాలు, బ్యాంక్ వివరాలు, 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు అక్రమ కార్యకలాపాల్లో ఉపయోగించబడినట్లు అనుమానిస్తున్నారు. ఈ అకౌంట్లలో కొన్నింటిని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ లోనూ వాడినట్లు ఈడీ గుర్తించింది.
ఈడీ అధికారులు పేర్కొన్న ప్రకారం, “గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. పథకం అమలులో ఉన్న అధికారులు, మధ్యవర్తులు, నకిలీ కంపెనీల పాత్ర ఉందని స్పష్టమవుతోంది. మొత్తం అక్రమ లావాదేవీల విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.”
ప్రస్తుతం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, రాజకీయంగా ఈ అంశం రాష్ట్రంలో సంచలనం రేపే అవకాశం ఉంది. మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తే, పలువురు కీలక నేతలు కూడా ఈ కేసులో నిందితులుగా నిలవవచ్చని భావిస్తున్నారు.
