Site icon NTV Telugu

TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ

Tgsrtc

Tgsrtc

TGSRTC : తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ డిపోలు నిర్మాణం, పాత బస్ స్టేషన్ల పునరుద్ధరణ, ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ.108.02 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మంజూరులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 30 బస్ స్టేషన్లు, డిపోలు అభివృద్ధి కాబోతున్నాయి. వాటిలో ముఖ్యంగా మద్గుల్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వేములవాడ, పాల్వంచ, అశ్వరావుపేట, హుస్నాబాద్‌, గోదావరిఖని, నర్సంపేట వంటి బస్ స్టేషన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల కొత్త డిపోలు నిర్మించబడుతుండగా, మరికొన్ని చోట్ల పునరుద్ధరణ, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టబడనుంది.

ఈ ప్రాజెక్టుల అమలుకు కావాల్సిన అన్ని చర్యలు తక్షణమే ప్రారంభించాలని ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి. త్వరితగతిన పనులు పూర్తిచేసి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యంగా మారింది. కానీ మహాలక్ష్మి పథకం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేయడం, కొత్త డిపోలు ఏర్పాటు చేయడం, బస్ స్టేషన్లను ఆధునీకరించడం ప్రారంభించాం. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమం – ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని RTCను మరింత ముందుకు తీసుకెళ్తాం,” అని స్పష్టం చేశారు.

Exit mobile version