Site icon NTV Telugu

CM Revanth Reddy : రాష్ట్రం 3 విభాగాలుగా వర్గీకరణ.. ఔటర్‌ ఔట్‌సైడ్‌ కొత్తగా రీజినల్‌ రింగురోడ్డు

Revanth Redy

Revanth Redy

CM Revanth Reddy : తెలంగాణ భవిష్యత్తు కోసం రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌’పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు , ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజా పాలనలో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, భవిష్యత్ పాలసీ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌కు ‘రైజింగ్‌ 2047’గా నామకరణం చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

గతాన్ని అనుభవంగా తీసుకుని, ఆ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూనే భవిష్యత్‌కు అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలసీలలో పెరాల్సిస్ వస్తే రాష్ట్ర భవిష్యత్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ పాలసీ డాక్యుమెంట్ తయారీలో భాగంగా, తాము ఐఎస్‌బీ (ISB), నీతి ఆయోగ్ వంటి ప్రముఖ సంస్థల సలహాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. విజన్‌లో భాగమే స్ట్రాటజీ అని, ఆ స్ట్రాటజీలో భాగంగానే తెలంగాణను మూడు ప్రధాన ఆర్థిక విభాగాలుగా వర్గీకరించామని సీఎం వివరించారు.

ముఖ్యమంత్రి తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్రంలోని ప్రాంతాలను మూడు విభాగాలుగా విభజించారు:

CURE (Core Urban Region Economy): ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి ప్రాంతం అంతా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పరిగణించబడుతుందని సీఎం తెలిపారు. గతంలో ఔటర్ లోపలి ప్రాంతంలో ఉన్న నాలుగు విభాగాల గందరగోళం తొలగిపోతుందని, కాలుష్య రహిత నగరంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని ‘క్యూర్‌’ చేయాల్సిందేనని వివరించారు.

PURE (Peri-Urban Region Economy): ఔటర్ రింగ్ రోడ్డు బయటి నుండి ఆర్‌ఆర్‌ఆర్‌ (Regional Ring Road) వరకు ఉన్న ప్రాంతాన్ని పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించారు. 360 కి.మీ. పొడవైన ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం అంగీకారం తెలిపిందని, ఇది నగరానికి రెండో అర్బన్ రీజియన్‌గా మారుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేలతో పాటు, బుల్లెట్ ట్రైన్ వేయడానికి కేంద్రం నుండి అనుమతి తెచ్చామని, హైదరాబాద్-బెంగుళూరు మధ్య కనెక్టివిటీని పెంచి అభివృద్ధిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

RARE (Rural Agricultural Region Economy): ఆర్‌ఆర్‌ఆర్‌ బయటి నుండి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీగా గుర్తించారు.

ఆదాయం-సంక్షేమం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన:

“ఆదాయం పెంచాలి… పేదలకు పంచాలి” అనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు. మనకు ఫుడ్ సమస్య లేకపోయినా, పోషకాహార (న్యూట్రీషియన్) సమస్య ఉందని, దాన్ని ఎలా పరిష్కారం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ గ్రామాలకు చేరినప్పటికీ, ఇప్పుడు నాణ్యమైన విద్య, సాంకేతిక విద్య అందించడంపై దృష్టి పెట్టామని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణను ‘నాలెడ్జ్ హబ్’గా మారిస్తే, పెట్టుబడులు, కంపెనీలు క్యూ కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ఎయిర్‌పోర్టుల విస్తరణలో భాగంగా వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త ఎయిర్‌పోర్టులు తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

 

Exit mobile version