Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!

  • తెలంగాణకు బియ్యం సేకరణ లక్ష్యం పెంపు
  • ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు
  • పెరిగిన కోటాను పూర్తిగా వినియోగించాలన్న సూచన
  • రైతులకు మేలు.. కొనుగోళ్లు వేగవంతం కానున్నాయి
Tg

Tg

తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని , ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ లక్ష్యాన్ని గతంలో ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ ఆమోదం తెలిపింది. అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని కేంద్రం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రైతుల మేలు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి గాను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి , కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

 

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ బియ్యం కోటాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా , సమర్థవంతంగా వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గత సీజన్లలో భారత ఆహార సంస్థ (FCI)కి బియ్యం అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించిన ఆయన, ఈసారైనా నిర్దేశించిన గడువులోగా పెంచిన సేకరణ కోటాను పూర్తి చేసి ధాన్యం రవాణాను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరడమే కాకుండా, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కూడా మరింత వేగవంతంగా సాగుతుందని భావిస్తున్నారు.