NTV Telugu Site icon

Telangana Rains: ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.. జూలై 24న వాయవ్యం..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో ఒడిశాకు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూలై 24న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హనుమకొండ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు.

Read also: Venkateswara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ సంకల్పాలు నెరవేరుతాయి

హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈరోజు సాయంత్రానికి మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో నీరు పడిపోతోంది. భారీ వరదలతో మూసీ నది పొంగిపొర్లుతోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గోదావరి ఉద్ధృతికి భద్రాచలం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు మరో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈరోజు సెలవులు ప్రకటించింది.
Rajasthan: మణిపూర్‌ గురించి మాట్లాడాడు.. మంత్రి పదవి పోయింది