Site icon NTV Telugu

Hyderabad: అస‌ని ఎఫెక్ట్.. నగరంలో చిరుజల్లులు

Wether

Wether

అసని తుఫాన్‌ ప్రభావంతో హైదరాబాద్‌లో వాన కురుస్తుంది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో నగరవాసులకు ఉక్కబోత నుంచి ఉపశమనం లభినట్లయింది. బుధవారం తెల్లవారుజాము నుంచే హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, నాంపల్లి, లక్డీకపూర్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌లో వానకురుస్తున్నది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడుతున్నాయి. అసని తుఫాను ప్రభావంతో మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ముందే హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనున్నదని, ప్రస్తుతం అది కాకినాడకు 260 కిలోమీటర్ల దూరం లో కేంద్రీకృతమైందని తెలిపింది.

ఈ తుఫాను పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నదని, క్రమంగా దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. బుధవారం సాయంత్రంలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరందాటే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మచిలీపట్నం వద్ద తీరాన్నితాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశమున్నదని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతోపాటు ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరోవైపు అన్ని ఓడరేవుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల అధికారి జగన్నాథకుమార్‌ సూచించారు. తీవ్ర తుఫాను కారణంగా విశాఖ నుంచి నడిచే పలువిమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండిగో, ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఇండియా సంస్థలు ప్రకటించాయి.

26 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు

పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాను ప్రదేశం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది. 26 జిల్లాల్లో 40 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా కుంటాలలో 44.2, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 44.0, మల్లాపూర్‌లో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. బుధ, గురువారాల్లో కూడా ఎండ తీవ్రత పలు జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version