Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ అధికారులు మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. సిట్ దృష్టి సారించిన అంశాలు… దర్యాప్తులో భాగంగా, ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్‌లను ఉపయోగించారు, ట్యాపింగ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ,పబ్లిక్ డేటా ట్యాపింగ్‌ను ఎలా నిర్వహించారు అనే కీలక ప్రశ్నలపై సిట్ ఫోకస్ పెట్టింది.
ప్రభాకర్ రావు విచారణ వివరాలు: నిన్న, రెండో రోజు కస్టడీలో భాగంగా ప్రభాకర్ రావును ఏడు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో ముఖ్యంగా 26 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. అధికారులు ఈ ధ్వంసమైన డిస్క్‌ల గురించి, అలాగే వాటి స్థానంలో రీప్లేస్ చేసిన ఏడు కొత్త హార్డ్ డిస్క్‌ల గురించి మరోసారి ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రభాకర్ రావు ఉపయోగించిన ఐదు ఐక్లౌడ్ ,ఐదు జిమెయిల్ ఖాతాలపై కూడా విచారణ జరిగింది. ముఖ్యంగా, నాలుగు జిమెయిల్ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ,రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎందుకు సేకరించారని సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో ఒక డివైస్‌లో లాగిన్ అయిన ఐక్లౌడ్ ఖాతా సమాచారాన్ని విశ్లేషించే పనిలో అధికారులు ఉన్నారు.
అంతర్జాతీయ సహకారం కోసం అభ్యర్థన: ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేయడంతో పాటు, గూగుల్ ,ఆపిల్ కంపెనీల నుంచి కూడా కీలకమైన డేటాను సేకరించడంపై సిట్ దృష్టి పెట్టింది. ఈ అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చే డేటా ఆధారంగా సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనుంది.
