Telangana: ప్రజల కోసం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర (సమితి) ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆ పథకానికి ఇంకా పేరు పెట్టలేదు. బహుశా “కార్మికబంధు” అనే పేరు పెట్టొచ్చని భావిస్తున్నారు. ఇందులోభాగంగా నిర్మాణ రంగ కార్మికులకు లక్ష బైక్‌లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటన చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు లక్ష బైకులను పంపిణీ చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేసినట్లు వెల్లడించారు.
కొత్త పథకం మొదటి దశలోనే వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. సిద్ధిపేటలో మూడు నెలల్లోపు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు 5 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. న్యాక్ సెంటర్‌లో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) సంస్థ ఏటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇస్తుందని చెప్పారు. నిర్మాణరంగ కార్మికులకు ఇన్సూరెన్స్ అమౌంట్‌ను మూడు లక్షల రూపాయల నుంచి ఆరు లక్షలకు పెంచిన విషయాన్ని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
CM KCR Delhi Tour: మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్..! సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశం..?
కొత్త పథకంలో భాగంగా ద్విచక్ర వాహనాలను ఎవరికి పంపిణీ చేయనున్నారనే స్పష్టత ప్రస్తుతానికి లేదు. నిర్మాణ రంగ కార్మికులకని చెప్పారు గానీ పూర్తి విధివిధానాలను ఇంకా వెల్లడించలేదు. పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. అర్హులను ఎలా నిర్ణయిస్తారు? ఆదాయ పరిమితిని ఎంత వరకు విధిస్తారో తెలియదు. చదువుకున్న యువత కోసం ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలను జారీ చేస్తున్న కేసీఆర్ సర్కారు ఈ పథకాన్ని చదువుకోని యువతకు ఉపాధి కల్పించేందుకు నిర్దేశిస్తుందేమో చూడాలి.
రైతుబంధు, దళితబంధు పథకాలతో ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికబంధు(?)లో ఆయా లబ్ధిదారులను మినహాయిస్తుందా లేక వాళ్లకు కూడా వర్తింపజేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యార్థులకు ఆదరణ పథకం కింద సైకిళ్లను పంపిణీ చేశారు. కొన్ని లక్షల మంది విద్యార్థుల వాటి ద్వారా ప్రయోజనం పొందారు. అప్పటికీ ఇప్పటికీ ప్రజల జీవన స్థాయిలు పెరిగాయి కాబట్టి మళ్లీ సైకిళ్లు ఇస్తే బాగోదని, బైక్‌లు ఇచ్చేందుకు నిర్ణయించారని అనుకోవచ్చు.