Site icon NTV Telugu

Municipal Elections : చైర్మన్ కుర్చీ కోసం రిసార్ట్ పాలిటిక్స్.. మేయర్ పీఠం.. కోట్లు కుమ్మరిస్తున్న నేతలు.!

Municipal Elections

Municipal Elections

Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరుగనుండగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరి దృష్టి ఇప్పుడు పట్టణ పీఠాలపైనే ఉంది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను దక్కించుకోవడానికి ఆశావహులు అనుసరిస్తున్న వ్యూహాలు, చేస్తున్న ఖర్చు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఈ గౌరవప్రదమైన కుర్చీల విలువ అక్షరాలా కోట్ల రూపాయల పలుకుతుండటం గమనార్హం.

సాధారణ వార్డు మెంబర్‌గా గెలవడం ఒక ఎత్తైతే, ఆపై మున్సిపల్ చైర్మన్‌గా లేదా మేయర్‌గా ఎంపికవ్వడం మరో ఎత్తు. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకునేందుకు అభ్యర్థులు భారీగా వెచ్చిస్తున్నారు. అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, అధిష్టానం వద్ద తమ పలుకుబడిని పెంచుకోవడమే కాకుండా, తోటి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కోట్ల రూపాయల ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. పదవి దక్కితే వచ్చే అధికారం, కాంట్రాక్టులు, స్థిరాస్తి వ్యాపారాల్లో దక్కే ప్రయోజనాల దృష్ట్యా ఈ స్థాయి ఖర్చును ఒక పెట్టుబడిగా నేతలు భావిస్తున్నారు.

YS Jagan: కూటమి ప్రభుత్వానికి హైప్ ఎక్కువ.. పనితీరు తక్కువ.. గణాంకాలు బయటపెట్టిన జగన్..

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులు ‘జంపింగ్’ కాకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని, అలాగే స్వతంత్ర అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభపెట్టకుండా గోవా, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఒక్కో ఓటుకు లక్షల రూపాయలతో పాటు ఇతర విలాసవంతమైన ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజాస్వామ్యం కంటే ధన బలమే ఎక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

మేయర్ , చైర్మన్ ఎన్నికల్లో కేవలం గెలిచిన కౌన్సిలర్లే కాకుండా, ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ‘ఎక్స్-అఫీషియో’ సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. మెజారిటీకి అతి సమీపంలో ఉన్న చోట్ల ఈ ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యేల మద్దతు కోసం ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే తమకు నచ్చిన వారికి పదవి కట్టబెట్టేందుకు చక్రం తిప్పుతుండటంతో, సాధారణ కౌన్సిలర్ల కంటే ఎక్స్-అఫీషియో సభ్యులకే ప్రాధాన్యత పెరిగింది.

మరోవైపు, 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడంతో, పాత నేతలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దించి తెరవెనుక పాలన సాగించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల పోటీ మరింత తీవ్రంగా మారింది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు రానుండగా, అసలైన ఉత్కంఠ మాత్రం ఫిబ్రవరి 16న జరిగే మేయర్, చైర్మన్ల పరోక్ష ఎన్నిక రోజే నెలకొననుంది. అప్పటివరకు ఈ ‘కోట్ల’ కుర్చీ లాటరీ కొనసాగుతూనే ఉంటుంది.

Tollywood : టాలీవుడ్‪లో విలన్స్‌గా మారుతోన్న మాలీవుడ్ హీరోస్

Exit mobile version