Site icon NTV Telugu

Telangana Cabinet : కాంగ్రెస్ కొత్త వ్యూహం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌లు

Kodandaram

Kodandaram

Telangana Cabinet : తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, అలాగే మైనారిటీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. ఈ మేరకు ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది. ఈ నిర్ణయం వెనుక కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజహరుద్దీన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానాన్ని ఆశించారు. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతనికి శాసన మండలిలో చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ ఎమ్మెల్సీ రేసులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అమీర్ అలీ ఖాన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో పక్కన పెట్టింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ. కోదండరాంకు ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వర్గాలను, ముఖ్యంగా మేధావులను తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రొ. కోదండరాం ప్రస్తుతం తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ తో కలిసి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు.

PM Modi Special Gifts: జపాన్ ప్రధానికి మోడీ ప్రత్యేక బహుమతి..

మాజీ క్రికెటర్, టీం ఇండియా కెప్టెన్ అయిన అజహరుద్దీన్ చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. గతంలో ఆయన లోక్‌సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కడం రాజకీయంగా కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ మైనారిటీ వర్గాలను సంతృప్తిపరచడంతో పాటు, హైదరాబాద్‌లో పార్టీ బలాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రద్దు చేసి షాక్ ఇచ్చింది. ఇప్పుడు అదే కోటాలో మళ్లీ కోదండరాంను నామినేట్ చేశారు రేవంత్ రెడ్డి. ’15 రోజుల్లో మళ్లీ కోదండరాంను ఎమ్మెల్సీగా పంపుతా.. ఎవడు అడ్డొస్తాడో చూస్తా..’ అని ఈ మధ్యే చెప్పారు. అన్నట్టుగానే మళ్లీ పంపించారు. ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తారా..? లేకుంటే చట్టపరమైన సవాళ్లు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందా..? అనే విషయం తెలనుంది.

Komatireddy Venkat Reddy : ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి

Exit mobile version