NTV Telugu Site icon

ఏడేళ్ల బీజేపీ పాలనలో ఏం ఒరిగింది..? పనికొచ్చేది ఒక్కటైనా చేశారా..?

minister singireddy niranjan reddy

minister singireddy niranjan reddy

ఏడేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏం ఒరిగింది..? ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? అంటూ నిలదీశారు తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాడు 2014లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉంటే.. దేశంలో పెట్రోలు రూ.77, డీజిల్ ధర రూ.68కి లభించింది.. ఇప్పుడు క్రూడాయిల్ ధర 83 ఉన్నప్పుడు పెట్రోల్ ధర రూ.115, డీజిల్ ధర రూ.107గా ఉందని గుర్తుచేశారు.. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, హరిత విప్లవంతో వచ్చిన పంటలను కంట్రోల్ షాపుల ద్వారా ఉత్తరాదిన గోధుమలు, దక్షిణాదిన బియ్యం పంపిణీ చేశారన్న ఆయన.. 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తులు దేశానికి అందించి ఘనత పంజాబ్ రాష్ట్రానిది అన్నారు.. 50 ఏళ్లు ఆ రాష్ట్ర రైతులు దేశానికి ఆహారం అందించడంలో కీలకపాత్ర పోషించారని.. కేసీఆర్ గారి నాయకత్వంలో ఏడేళ్లలో తెలంగాణ రైతాంగం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు అందుబాటులోకి రాక ముందే, సీతారామ, డిండి పథకాలు రాకముందే గత ఏడాది పంజాబ్ రాష్ట్రాన్ని మించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశ కీర్తిశిఖరమై నిలిచింది.. ఇది తెలంగాణ గొప్పతనంగా తెలిపారు.

రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు పథకాలు, రైతు, వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఇది సాగు పెరిగిందన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.. ఉత్తరాదిన రెండో పంట వరి సాధ్యం కాదు.. దక్షిణాదిన మాత్రమే రెండో పంట వరి పండుతుందని.. అనతికాలంలోనే అత్యధిక దిగుబడులు సాధిస్తూ దేశానికి తలమానికమవుతున్న తెలంగాణకు చేయూతనివ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు, మెడికల్ కళాశాలలు, కొత్త మండలాలు, కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతి పని ప్రస్తుత, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుందన్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టికి ఏడేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలన నిదర్శనంగా తెలిపారు.. ప్రజల ప్రయోజనాల కోసమే మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాలలో సమీకృత మార్కెట్ల నిర్మాణం జరుగుతుందన్నారు వ్యవసాయ మంత్రి.. ప్రజల జీవన ప్రమాణాల పెంపులో భాగంగానే పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మాంసం దుకాణాలు ఒకే చోట లభించేలా సమీకృత మార్కెట్లు.. రహదారుల మీద వ్యాపారం చేసే వారిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, ధూళి, దుమ్ములేని ఉత్పత్తులు ప్రజలకు అందాలన్న దూరదృష్టితో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.. ప్రజల శ్రేయస్సు నేపథ్యంలో ఎవరూ సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వ్యతిరేకించవద్దు అని విజ్ఞప్తి చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.