Site icon NTV Telugu

వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ వద్దు.. లేదంటే రైతుల తరహాలో నేతన్నల ఉద్యమం..!

వస్ర్త పరిశ్రమపై అదనపు జీఎస్టీ విధించేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే, అప్పుడే రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.. వస్త్ర పరిశ్రమపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.. జనవరి 1వ తేదీ నుంచి వస్ర్త పరిశ్రమపైన విధించబోతున్న అదనపు జీఎస్టీ పన్ను ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేసిన ఆయన.. సీఎస్టీ పెంపు వలన దేశంలోని వస్త్ర మరియు చేనేత పరిశ్రమ పూర్తిస్థాయిలో కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.. దేశంలో వస్ర్త పరిశ్రమపై అధారపడిన కోట్లాది మంది కార్మికులకు సమ్మెటపోటని, ఇది వారి జీవితాలను పూర్తిగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు కేటీఆర్.

Read Also: మందు బాబులకు వార్నింగ్‌.. తాగి దొరికితే ఇక అంతే..!

ఇక, ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని పున:సమీక్షించుకుని, వెంటనే విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తరపున డిమాండ్ చేశారు కేటీఆర్.. జీఎస్టీ పన్ను పెంపు ద్వారా 80 నుంచి 85 శాతం దేశంలోని చేనేత జౌళి పరిశ్రమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని.. ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడతారన్న ఆయన.. టెక్స్ టైల్, అప్పారెల్ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.. చేనేత, జౌళి రంగంలోని కోట్లాదిమంది ఉద్యోగాలకు ఎసరు పెట్టే ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్.. జీఎస్టీ పెంపు విషయంలో వస్త్ర పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను, జరుగుతున్న అందోళనలను పరిగణలోకి తీసుకోవాలి.. జీఎస్టీ పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్తే వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరే దేశంలోని నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామిక వర్గాలకు, దేశంలోని నేతన్నలకు తెలంగాణ తరపున అండగా నిలబడతామని ప్రకటించారు మంత్రి కేటీఆర్.

Exit mobile version