హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిని నందమూరి తారకరామారావు ప్రారంభించారని.. తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకువస్తుందని బాలయ్య అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా హాస్పిటల్ స్టార్ట్ చేశామని తెలిపారు. తన తల్లి బసవతారకం కోరిక మీద ఈ ఆస్పత్రి ప్రారంభించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో ఆర్థికంగా ఆదుకున్న వారికి వందనాలు తెలియజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావుపై బాలయ్య ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రజల మనిషి అంటూ కొనియాడారు. ఆదర్శమైన నాయకుడు హరీష్ రావు అన్నారు. ఆయన్ను ఒక్కసారి వెళ్లి కలిస్తేనే ఆస్పత్రికి సంబంధించిన ఆరు కోట్ల రూపాయల ట్యాక్స్‌ను మాఫీ చేశారని బాలకృష్ణ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కింద పేషెంట్లను ట్రీట్ చేస్తున్న ఆస్పత్రుల్లో బసవ తారకం హాస్పిటల్ సెకండ్ ప్లేస్‌లో ఉందన్నారు. ఎంతోమంది దాతలు ఆస్పత్రికి తమ సాయం అందిస్తున్నారని.. తాము చేసే ప్రతి పనికి.. మీడియా ప్రజలకు అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు, కేసీఆర్‌కు మంచి సంబంధం ఉందని.. రూ.753 కోట్లను తాము క్యాన్సర్ బాధితుల కోసం ఖర్చు చేశామని తెలిపారు. బసవతారకం ఆస్పత్రిలో3 లక్షల మంది బాధితులకు వైద్యం అందించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని.. హెల్త్ మినిస్టర్ అయ్యాక బాలకృష్ణ తన దగ్గరకు రెండుసార్లు వచ్చారని హరీష్‌రావు అన్నారు. బాలకృష్ణ పైకి కరుకుగా కనిపిస్తారని.. మనసు మాత్రం సాఫ్ట్ అని ప్రశంసించారు. బయట బాలకృష్ణ వేరు.. లోపల బాలకృష్ణ వేరు అని హరీష్‌రావు తెలిపారు. అటు సినిమా రంగంలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ తనదైన శైలిలో బాలకృష్ణ రాణిస్తున్నారని మంత్రి హరీష్‌రావు కొనియాడారు.
అటు దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులు పెరగడం దురదృష్టకరమని మంత్రి హరీష్‌రావు అభిప్రాయపడ్డారు. 75 శాతం మంది ప్రజలు రోగం వస్తే కానీ ఆలోచించరని.. క్యాన్సర్ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయని.. క్యాన్సర్‌ను నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్యాన్సర్ శరీరంలో ఉందనే విషయమే గుర్తించడం కష్టమని.. హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్యం పట్ల చైతన్యం పెరుగుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు. కీమో థెరపీ సేవలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో తెస్తున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఎంఎన్‌జే ఆస్పత్రిని 750 పడకలకు అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. నిమ్స్‌లో 8 మందికి, ఎంఎన్‌జేలో ఇద్దరికి ప్రతి నెల ఉచితంగా న్యూరో బోన్ సర్జరీ అందిస్తున్నామని హరీష్‌రావు తెలిపారు.
