Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ టార్గెట్.!

  • తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు
  • రూ.3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
  • వేమో డ్రైవర్‌లెస్‌ కారులో ప్రయాణం
  • హైదరాబాద్‌లో స్వయంచాలక మొబిలిటీపై ఆసక్తి
  • ప్రవాసులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్‌ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ (సీజీఐ ఎస్ఎఫ్‌ఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్ర మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బే ఏరియాకు చెందిన తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో ఆయన సమావేశమయ్యారు.

తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. పారిశ్రామిక కారిడార్లు, పార్కుల్లో తయారీ, ఐటీ, జీవశాస్త్రం, స్వచ్ఛ ఇంధనం తదితర రంగాల్లో పెట్టుబడులకు అనువైన భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు ఇతర విద్యా, సాంకేతిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని వివరించారు.

తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ అందించే సామర్థ్యం ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సంప్రదాయ విద్యుత్‌తో పాటు పునరుత్పాదక ఇంధన వనరు రంగంలోనూ రాష్ట్రం గ‌రిష్ట ప్ర‌గ‌తిని సాధిస్తోంద‌ని చెప్పారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. అనుమ‌తులకు ఎక్క‌డా అల‌స్యం జ‌ర‌క్కుండా పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

అత్యాధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికను సమన్వయం చేస్తూ ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్‌య‌మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని చెప్పారు. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎన‌ర్జీ, అధునాతన తయారీ, నాలెడ్జ్‌ ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే ప్ర‌జాప్ర‌భుత్వ లక్ష్యమని వివరించారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో తెలంగాణ ప్రవాసులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల విస్తరణలో భాగస్వాములు కావాలని కోరారు.

అమెరికా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాన్‌ఫ్రాన్సిస్కోలో వేమో స్వయంచాలక (డ్రైవర్‌లెస్‌) వాహనంలో ప్రయాణించారు. అనంతరం వేమో ప్రతినిధులతో సమావేశమై స్వయంచాలక వాహన సాంకేతికత, దాని నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నియంత్రణ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు ప్రతిపాదిత ఫ్యూచర్‌ సిటీలో స్వయంచాలక మొబిలిటీ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై ఆయన ఆరా తీశారు. ఇందుకు అవసరమైన అధిక రిజల్యూషన్‌ మ్యాపింగ్‌, సెన్సార్‌ అనుకూల రోడ్డు డిజైన్‌, ప్రత్యేక టెస్టింగ్‌ కారిడార్లు, డేటా కనెక్టివిటీ, ఏఐ కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాల గురించి వేమో ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

స్వయంచాలక వాహనాల ట్రయల్స్‌, భవిష్యత్‌ విస్తరణకు అవసరమైన నియంత్రణ, విధానపరమైన చట్రాలపైనా చర్చించారు. నూతన తరం మొబిలిటీ సాంకేతికతను హైదరాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ఆసక్తి వ్యక్తం చేశారు.