తెలంగాణలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) అమర్చుకోవడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. 1989 మోటారు వాహనాల చట్టంలోని రూల్ 50 ప్రకారం ఈ నిబంధన అమల్లో ఉందని తెలిపారు. అయితే చాలా వాహనాలకు HSRP అమర్చుకోకపోవడం, అమర్చుకున్న వాటి వివరాలు కూడా వాహన్ (VAHAN) పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం లేదన్న అంశంపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏడు రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా 1.54 లక్షల వాహనాలకు పెండింగ్.. ఆర్సీ ప్రింటింగ్‌కు లింక్
రాష్ట్రంలో మొత్తం 6,10,330 వాహనాలు రిజిస్టర్ కాగా, ఇప్పటివరకు 4,56,298 వాహనాలకు HSRP అమర్చినట్లు అప్‌డేట్ చేశారు. మిగిలిన 1,54,032 వాహనాలకు ఇంకా HSRP నంబర్ ప్లేట్లు అమర్చాల్సి ఉంది. వాహనానికి HSRP అమర్చిన తర్వాతే ఆర్సీ (RC) కార్డు ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుందని రవాణా శాఖ స్పష్టం చేసింది.
తనిఖీలు, నోటీసులు.. చట్టపరమైన చర్యల హెచ్చరిక
ఏడు రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా వాహనదారులకు ఫోన్లు, నోటీసుల ద్వారా సమాచారం అందించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే HSRP నంబర్ ప్లేట్లు అమర్చుకోని వాహనాలపై తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా HSRP లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

