హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పలు కీలక ప్రాజెక్టులు, ఉపాధి కల్పన , మౌలిక వసతుల కల్పనపై వివరాలు వెల్లడించారు.
అక్టోబర్ 25 నుంచి ‘హ్యామ్’ రోడ్లు.. ఉపాధి కూలీలకు ₹8,000 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో చేపట్టబోతున్న రోడ్ల నిర్మాణ పనులను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఈ హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. వీటితో పాటు ఎల్నినో ప్రభావం , వ్యవసాయ పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించామని పేర్కొన్నారు. రైతులకు వారు వేయాల్సిన పంటలపై ముందస్తుగానే అవగాహన కల్పించామని, ‘రాంజీ’ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు ఏకంగా ₹8,000 కోట్ల విలువైన పనులు కల్పించబోతున్నామని స్పష్టం చేశారు.
గుత్తి కోయ గూడాలకు తాగునీరు.. దివ్యా దేవరాజన్ నేతృత్వంలో కమిటీ
ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రజలకు సరిపడా తాగునీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అధికారి దాన కిషోర్ ఇచ్చిన సలహా మేరకు, ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోని దూరప్రాంత గుత్తి కోయ గూడాలకు సురక్షిత తాగునీరు ఎలా అందించాలనే అంశంపై ప్రత్యేక నివేదిక కోసం ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీతక్క ప్రకటించారు.
ప్రతి గ్రామానికి ₹50 లక్షలు.. మహిళా సంఘాలకు ఆర్‌టీసీ బస్సులు
గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ. 67,000 కోట్లు వెచ్చిస్తోందని, అందులో భాగంగా 553 మండలాల్లో మహిళా సంఘాలకు ఆర్‌టీసీ బస్సులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ‘రాంజీ’ పథకం ద్వారా ప్రతి గ్రామానికి ₹50 లక్షల రూపాయలను అందించబోతున్నామని, ఈ నిధులతో గ్రామంలో ఏ పనులు చేపట్టాలనేది ఆ గ్రామ ప్రజలే స్వయంగా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని సర్పంచ్‌ల ద్వారా గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి సమీక్షా సమావేశాన్నే రేపు రంగారెడ్డి జిల్లాలోనూ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క ముగించారు.

