Site icon NTV Telugu

తెలంగాణలో స్కూళ్ళు, కాలేజీలు ఎప్పుడంటే?

తెలంగాణలో కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం సంక్రాంతి సెలవుల‌ను 30వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గత సోమ‌వారం నుంచి 8, 9, 10 త‌ర‌గతుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాల‌ని ఆదేశించింది. అయితే మరో ఐదు రోజుల్లో సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసుల వల్ల అంతగా నేర్చుకోవడం లేదని, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యక్ష త‌ర‌గ‌తుల‌ను నిర్వహిస్తేనే మంచిదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐదు రోజుల్లో కేసులు సంఖ్య భారీగా పెరిగినా, ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోయినా సెల‌వులు మ‌రో వారం పొడిగించవచ్చు. సాధ్యమయినంత త్వరగా క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా వుంటే.. విద్యాసంస్థల తిరిగి ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జనవరి 30 తర్వాత విద్యాసంస్థలు తెరవాలా? వద్దా? అనేది 30వ తేదీ నాటికి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Exit mobile version