Tummala Nageswara Rao : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ముందుచూపు లేదని ఆయన ఆరోపించారు. దేశంలో యూరియా ఉత్పత్తి తక్కువగా ఉందని, దానివల్ల యూరియా కోసం చైనా, జపాన్, జర్మనీ వంటి ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన అన్నారు. దేశంలో కేవలం 30 శాతం మాత్రమే యూరియా ఉత్పత్తి అవుతుందని, మిగిలిన 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుందని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది రామగుండం, నాగార్జున వంటి ఎరువుల కర్మాగారాలు పనిచేయకపోవడంతో ఉత్పత్తి మరింత తగ్గిందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రష్యా నుంచి రావలసిన యూరియా రాలేదని, యూరప్ నుండి రావాల్సిన యూరియా ఎర్ర సముద్రం ద్వారా రావాలి కానీ, యుద్ధం కారణంగా ఎర్ర సముద్రం వద్ద నౌకలను నిలిపివేశారని కేంద్ర అధికారులు తమకు చెప్పారని ఆయన వివరించారు. దీనివల్ల నౌకలు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని, అందువల్ల రెండు మూడు నెలల పాటు యూరియా రాక ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఏడాది టెండర్లు కూడా చాలా ఆలస్యమయ్యాయని, చైనా నుంచి ఒక్క బస్తా యూరియా కూడా రాలేదని అన్నారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, కేవలం 7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న యూరియా మొత్తాన్ని ఈ నెలలోనే ఇవ్వాలని కేంద్ర మంత్రులను కలిసి కోరామని ఆయన చెప్పారు. ఇందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అలాగే, రాబోయే రబీ కాలానికి అవసరమైన యూరియాను కూడా ముందుగానే ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణలోని యూరియా కంపెనీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని, తద్వారా రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యూరియా కొరతను అధిగమించేందుకు నానో యూరియా లిక్విడ్ రూపంలో అందుబాటులోకి వచ్చిందని, ఇది సాధారణ యూరియా కంటే బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో రైతులు నానో యూరియాను ప్రత్యామ్నాయంగా అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పెద్ద ఎత్తున డ్రోన్‌లను కూడా సరఫరా చేయాలని చూస్తున్నామని, అంతేకాకుండా, సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Bhadra Kaali: ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో భద్రకాళి బిగ్గెస్ట్ మూవీ!
