NTV Telugu Site icon

అన్ని రంగాల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలి.. గవర్నర్‌ పిలుపు..

Governor Tamilisai

Governor Tamilisai

అన్ని రంగాల్లోనూ మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే, భిన్నత్వాన్ని, సమ్మిళిత సమాజాన్ని సాధించాలంటే మహిళా నాయకత్వాన్ని అన్ని దశలలోనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరమ్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన గవర్నర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగంలో, అలాగే వివిధ వ్యవస్థలలో సీనియర్ పొజిషన్‌లో మహిళా నాయకత్వం చాలా తక్కువ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే నాయకత్వ బృందాలలో మహిళలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందని.. అప్పుడే మహిళలకు సమాన ప్రాతినిథ్యం దొరుకుతుందని, లింగ వివక్ష తగ్గుతుందని పేర్కొన్నారు.

మొత్తం ఎంటర్‌ప్రెన్యూర్‌లలో మహిళలు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారని.. ఉన్నారని, వారిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంపొందించడానికి మరింతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు గవర్నర్‌ తమిళిసై.. ఆర్థిక రంగంలో, ఉద్యోగ రంగంలో మరింత ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం అయినప్పుడు భారత్.. జీడీపీ ఎన్నో రెట్లు పెరుగుతుందని వివరించారు.. ఇంతకాలం పురుషులకు మాత్రమే సొంతం అనుకున్న అనేక రంగాలలో మహిళలు సత్తా చాటుతున్నారని గుర్తుచేసిన గవర్నర్.. అయినప్పటికీ అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యం, సరైన నాయకత్వం సాధించడానికి, లింగవివక్ష లేని సమాజాన్ని నిర్మించడానికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు..