Telangana Government Declared Holiday On Telangana National Integration Day: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్న తరుణంలో.. రేపు సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు రాష్ట్రంలోని విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.
ఇదిలావుండగా.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత యూనియన్‌లో తెలంగాణ విలీనమై 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న నేపథ్యంలో.. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఈ వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తొలిరోజులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరుపుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు పాలుపంచుకోనున్నారని సమాచారం. మహారాష్ట్ర సీఎంతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు సైతం హాజరు కానున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ ధృవీకరించారు.
