NTV Telugu Site icon

హుజురాబాద్‌ బైపోల్.. ఎన్నికల కమిషన్‌ కీలక ఆదేశాలు

ఎట్టకేలకు హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వ సూచనలతో గతంలో వాయిదా పడినా.. ఇప్పుడు షెడ్యూల్‌ వచ్చేసింది.. ఈ నేపథ్యంలో.. కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నికలకి షెడ్యూల్ ఇచ్చింది.. అక్టోబర్ 30న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 2 ఫలితాలు వెలువడతాయని తెలిపారు.. కోవిడ్ కేసులు ఇంకా వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. నిబంధనలు ఏవిధంగా తీసుకోవాలని అనేదానిపై పలు సూచనలు చేశారు.

నామినేషన్ సంబంధించి ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు శశాంక్ గోయల్.. నామినేషన్ సందర్భంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని.. ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని.. స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్ కూడా కుదించాలని తెలిపారు.. రోడ్ షోలు, మోటార్ ర్యాలీలకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఇంటింటికీ ప్రచారంలోకూడా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.. ఇక, పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని.. వాహనాల్లో కూడా పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని సూచించారు. దీనిపై కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశాం.. ప్రతి ఒక్కరు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాల్సిందే అన్నారు.. అధికారులకు కూడా సూచిస్తున్న.. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని.. ఇవాళ్టి నుంచి మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు. మరోవైపు.. హుజురాబాద్ నియోజకవర్గం రెండు జిల్లాలో ఉంటుందని.. ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు.. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఇప్పటికే ఈవీఎంలు పరిశీలించామని వెల్లడించిన శశాంక్‌ గోయల్.. నియోజకవర్గ పరిధిలో 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 47 పోలింగ్ కేంద్రాల్లో 1,000 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని.. ఈ పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తాం అన్నారు..

ఇక, హుజురాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,36,430 ఓటర్లు ఉన్నారని తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కోవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తామన్న ఆయన.. ఓటర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.. కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారు పోలింగ్ వారం ముందు వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్ గోయింగ్ ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు.. ఈ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ఉంటుందని వెల్లడించారు.. మిగత రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకునున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. పోలింగ్ స్టాఫ్, అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు.. రెండు వ్యాక్సిన్లను వేసుకొని ఉండాలని తెలిపారు.. ఒక్క నోడల్ వైద్య అధికారిని నియమించాలని అధికారులకు సూచించిన ఆయన.. నియోజకవర్గం వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ మరింత స్పీడ్ పెంచాలని ఆదేశించారు.