Pashamylaram Drug Raid: తెలంగాణలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ ముడిసరుకు తయారీ రాకెట్‌ను ముంబై క్రైమ్ డిటెక్షన్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని ఐడీఏ పాశమైలారంలో ఉన్న ఓ పరిశ్రమపై స్థానిక పటాన్చెరు పోలీసుల సహకారంతో ముంబై బృందాలు ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించాయి.
ఈ సోదాల్లో ఎండీ (MDMA) డ్రగ్స్ తయారీలో అత్యంత కీలకమైన ‘2-బ్రోమో-4-మిథైల్ ప్రొపియోఫినోన్’ (2-Bromo-4-Methylpropiophenone) రసాయన పొడిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యాక్టరీ నుంచి దాదాపు రూ.27 లక్షల విలువైన 44.699 కిలోల రసాయన పొడితో పాటు, తయారీకి వినియోగించే ఇతర ద్రవ రసాయనాలు, ల్యాబ్ యంత్ర పరికరాలను సీజ్ చేశారు. ఈ అక్రమ యూనిట్ నిర్వాహకుడు రమేష్ బాబు సాకేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్త డ్రగ్స్ నెట్‌వర్క్‌ను కూపీ లాగుతున్న ముంబై క్రైమ్ బ్రాంచ్.. గతంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలోనూ భారీగా ఎండీ తయారీ కేంద్రాలను గుట్టురట్టు చేసింది. ఈ డ్రగ్స్ దందా కేసులో ఇప్పటివరకు మొత్తం 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటిదాకా నిర్వహించిన దాడుల్లో మొత్తం 69.871 కిలోల ఎండీ డ్రగ్స్, 260 లీటర్ల ముడి రసాయనాలు, భారీగా నగదు, ల్యాబ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ తయారీ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలు మరియు అంతర్రాష్ట్ర సరఫరా నెట్‌వర్క్‌పై ముంబై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

