NTV Telugu Site icon

లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా.. డీజీపీ ఆదేశాలు

DGP Mahendar Reddy

క‌రోనా క‌ట్ట‌డి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది.. ఇక‌, ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం కేసీఆర్… అయితే లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలోనే కాదు.. ఎప్పుడు ప‌డితే అప్పుడు రోడ్డు ఎక్కేవారి సంఖ్య భారీగానే ఉంది… అస‌లు త‌మ‌కు ఏదీ ప‌ట్ట‌న‌ట్టుగా చిన్న‌చిన్న కార‌ణాలు చెప్పి య‌థేచ్ఛ‌గా తిరిగేస్తున్నారు కొంద‌రు. దీంతో.. లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు తెలంగాణ పోలీసులు.. ఈ మేర‌కు పోలీసు అధికారులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.. లాక్ డౌన్ అమలుపై జోనల్ ఐజీలు, డీఐజీలు పోలీస్ కమిషనర్లు, ఎస్సీల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుతీరును ప్రతిరోజు జిల్లాల వారిగా సీఎం కేసీఆర్ స‌మీక్షిస్తున్నార‌ని తెలిపారు.. మే 30వ తేదీ అనంతరం తిరిగి లాక్ డౌన్ ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాల‌న్న ఆయ‌న‌.. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉన్నప్పటికీ 8 గంటల తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమ్మికూడి క‌న‌పిస్తున్నార‌ని.. దీనిని నివారించేందుకు ఉదయం 6 గంటల నుండే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు.

ఇక‌, 10 గంటల త‌ర్వాత కూడా వీధుల్లో పెద్ద ఎత్తున జనసంచారం ఉంటుందని, దీనిని నివారించేందుకై తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. ఉదయం 9:45 గంటల నుండే పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీలు, డీఎస్పీలు, ఏసీపీ స్థాయి ఉన్నతాధికారులందరూ కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో జన సామర్థ్యాన్ని తగ్గిచేందుకు మార్కెటింగ్, మున్సిపల్, సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా మార్కెట్లను వికేంద్రించేవిధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఉదయం 10 గంటల అనంతరం అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే తాత్కాలికంగా సీజ్ చేయాలని ఆదేశించారు. కేవలం ప్రధాన రహదారుల్లోనే లాక్ డౌన్ అమలు చేయడమే కాకుండా కాలనీలు, అంతర్గత రహదారుల్లోనూ కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయం ముగియగానే ఉదయం 10 గంటలకు అన్ని పెట్రోలింగ్ వాహనాలు సైరన్ వేసి సంచరించాలని తెలిపారు. లాక్ డౌన్ అమలుపై సామన్య ప్రజానికం నుండి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఈ విషయంలో పోలీసు శాఖ పై ఏవిధమైన ఫిర్యాదులు అందడంలేద‌న్న డీజీపీ.. రాష్ట్రంలో పెట్రోల్ బంక్ లను పూర్తిస్థాయిలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసిందని, అయితే, లాక్ డౌన్ అనంతరం కేవలం అనుమతించిన వాహనాలు, అంబులెన్స్ లు, ఆక్సిజన్ రవాణా లాంటి వాహనాలు మాత్రమే పెట్రోల్ బంకులకు అనుమతించాలని స్పష్టం చేశారు.