Site icon NTV Telugu

Ramadan 2022: కనిపించిన నెలవంక.. ముస్లిములకు కేసీఆర్ విషెస్

Kcr

Kcr

సోమవారం సాయంత్రం నెలవంక కనిపించిన సందర్భంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిములకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదిన వేడుకల్ని సంతోషంగా జరుపుకొని, పవిత్ర ప్రార్థనలతో ఆ అల్లాహ్ దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగ మానవ సేవే చేయాలన్న మంచి సందేశాన్ని మానవాళికి ఇస్తుందని.. ఈ మాసంలో ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనాలు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని అన్నారు.

Read Also: Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ ప్రయోగం వెనక రాజకీయం..!

గంగా – జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని చెప్పిన కేసీఆర్.. లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, వారి సంక్షేమానికి ప్రతి ఏటా భారీగా నిధుల్ని కేటాయించడంతో పాటు మరెన్నో కార్యక్రమాల్ని చేపడుతోందని చెప్పారు. మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణనిచ్చి, స్వయం ఉపాధి అవకాశాల్ని తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తూ.. ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు కూడా తెలంగాణ సర్కార్ బాటలు వేస్తోందన్నారు.

‘షాదీ ముబారక్’ పథకం ద్వారా ఆడ పిల్లల పెళ్ళి ఖర్చుల కోసం ఒక లక్ష 116 రూపాయల సాయం అందించి, ముస్లిం పేదింటి ఆడపిల్లల కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకుంటోందని వెల్లడించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, మత సామరస్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందన్నారు. లౌకిక వాద విఘాత శక్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

Exit mobile version