బీజేపీపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని.. లేకపోతే తీవ్రస్థాయిలో నష్టం తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని తెలిపారు. 12శాతం జీడీపీ వృద్ధి ఉండే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రధాని మోదీ అవసరం దేశానికి లేదని.. 2025 నాటికి రూ.5లక్షల కోట్ల ఆర్థిక వృద్ధికి ప్రధాని, ఆర్థిక మంత్రి అవసరం లేదని.. అది సహజంగా జరిగేదేనని చెప్పారు. చేతనైతే చైనా, సింగపూర్‌లాగా దేశాన్ని మార్చాలని హితవు పలికారు. దేశంలో బ్యాంకులను ముంచి పారిపోయిన దొంగలందరూ మోదీకి దోస్తులే అని కేసీఆర్ ఆరోపించారు. ఇది నిజం కాదా అని ఆయన బీజేపీ నేతలను నిలదీశారు.
ఇవన్నీ వదిలిపెట్టి తనను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని.. వీళ్లను చూస్తే తనకు జాలి కలుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దమ్మున్నవాళ్లయితే తనను జైలులో వేసి చూడాలన్నారు. అయినా తప్పు చేసినోళ్లే అలాంటి వ్యాఖ్యలకు భయపడతారని.. తమకు భయం లేదన్నారు. దేశంలో రాఫెల్ కుంభకోణం బయటకు రావాలని.. అందులో దొంగలు బయటపడాలని కేసీఆర్ పేర్కొన్నారు. రాఫెల్‌పై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధవిమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని.. అటు ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధవిమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొన్నదన్నారు. మన కంటే తక్కువ ధరకే ఇండోనేషియా కొనుగోలు చేసిందన్నారు. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసిందన్నారు. ఇప్పుడు తెలియడంలేదా ఎవడు దొంగ అనేది అని కేసీఆర్ నిలదీశారు. ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి అని.. తాను ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనని కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతామన్నారు. మోదీ ప్రభుత్వ అవినీతిపై తాము సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
