Duddilla Sridhar Babu : తెలంగాణలో లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి టీ-హబ్ తరహాలోనే **’బీ-హబ్’**ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన 21వ ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొడక్ట్ డిజైన్’ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సదస్సును యూఎంవో ఫౌండేషన్, యూఎక్స్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌ను కేవలం టెక్నాలజీ హబ్‌గానే కాకుండా, ప్రపంచస్థాయిలో ‘గ్లోబల్ డిజైన్ హబ్’గా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా త్వరలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజైన్’ను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ‘ఏఐ ఇన్నోవేషన్ హబ్’లో డిజైనింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఏదైనా యాప్ లేదా వెబ్‌సైట్ విజయం సాధించాలంటే డిజైనింగ్ అత్యంత కీలకమని, అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలచుకోవడానికి కొత్తగా ఆలోచించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కలిసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
