హైదరాబాద్ సైదాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న 100 మంది అభ్యర్థులకు నెలకు ఇచ్చే స్టైఫండ్‌తో పాటు బుక్ ఫండ్‌ను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నెలకు రూ.5,000గా ఉన్న స్టైఫండ్‌ను రూ.7,000కి పెంచగా, పుస్తకాల కొనుగోలు కోసం ఇచ్చే వన్-టైమ్ బుక్ ఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు రెట్టింపు చేశారు. ఈ పెంచిన ఆర్థిక సాయాన్ని వచ్చే నెల నుంచే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలు, సిఫార్సుల ఆధారంగానే ఈ పెంపు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం సైదాబాద్ కేంద్రంలో 100 మంది బీసీ విద్యార్థులకు మూడేళ్ల వ్యవధితో సివిల్స్ సమగ్ర శిక్షణ అందిస్తున్నామన్నారు. వీరితో పాటు మరొక 100 మంది అభ్యర్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ‘ఫౌండేషన్ కోర్సు’లలో ట్రైనింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు బయట ప్రైవేట్ స్టడీ హాల్స్‌కు వెళ్లి అనవసరంగా డబ్బులు వృథా చేసుకోకూడదనే ఉద్దేశంతో, స్టడీ సర్కిల్ లైబ్రరీ వేళలను కూడా పొడిగించినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు లైబ్రరీ సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

