Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు

  • ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
  • పాత ఆటోలను ఈవీలుగా మార్చితే రూ.1.50 లక్షల సాయం
  • ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • సమ్మె విరమించండి.. చర్చలకు రండి: పొన్నం ప్రభాకర్
Auuto

Auuto

తెలంగాణలోని ఆటో, క్యాబ్, స్కూల్ బస్సు డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కార్మిక సంఘాలను కోరారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేకపోవడంతో హుస్నాబాద్ నుంచి ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూలతతో ఉందని స్పష్టం చేశారు.

కేబినెట్ కీలక నిర్ణయం: ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి (కేబినెట్) ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు (SOP) రూపొందించి బోర్డును అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దీని ద్వారా రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ఆటో డ్రైవర్ల కుటుంబాలన్నింటికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పాత ఆటోల కన్వర్షన్‌కు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం

హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని నివారించడంతో పాటు డ్రైవర్లపై పడుతున్న ఆర్థిక భార తగ్గించేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ఆమోదించిందని మంత్రి తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ (EV) ఆటోలుగా మార్చుకునే (రెట్రోఫిట్మెంట్) వారికి ప్రభుత్వం తరఫున రూ. 1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే వారికి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, దశలవారీగా ఈ-ఆటోలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఆటో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ

రాష్ట్రంలో 2012 తర్వాత ఆటో ఛార్జీలను సవరించలేదని, ఈ మధ్యకాలంలో పెరిగిన ఇంధన ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం గమనించిందని మంత్రి చెప్పారు. ఛార్జీల పెంపు అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, ఇతర భాగస్వాములను చేర్చి, అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే సముచిత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమ్మెతో సమస్యలు తీరవు.. చర్చలకు ఆహ్వానం

ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏ రకంగా అయితే పరిష్కరించామో, అదే రీతిలో ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. సమ్మెకు వెళ్లడం వల్ల ప్రజలతో పాటు డ్రైవర్లు కూడా ఇబ్బంది పడతారని, చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. సమ్మె నిర్ణయాన్ని విరమించుకుని ప్రభుత్వంతో చర్చలకు రావలసిందిగా కార్మిక సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. త్వరలోనే రవాణా శాఖ అధికారులు, యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.